శంషాబాద్ విమానాశ్రయంలో విషాదం చోటు చేసుకుంది. నగరంలోని శంషాబాద్ విమానాశ్రయంలో 11 నెలల శిశువు ఊపిరాడక తెగ ఇబ్బందిపడి ప్రాణాలు వదిలింది. అందరినీ కలిచివేస్తున్న ఈ ఘటన గురించి ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం.. అమెరికా నుంచి హైదరాబాద్ వస్తున్న విమానంలో 11 నెలల శిశువు ఊపిరాడక చాలా ఇబ్బంది పడింది. విమాన సిబ్బంది ఆ పసికందును కాపాడటానికి విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికీ పాప ప్రాణాలు కాపాడలేకపోయారు.పాప అస్వస్థతకు గురికాగానే విమాన సిబ్బంది ముందస్తుగా హైదరాబాద్ విమానాశ్రయంలో డాక్టర్‌ను, అంబులెన్స్‌ను సిద్ధం చేయమని చెప్పారు. శంషాబాద్‌లో విమానం లాండింగ్ అయిన వెంటనే హుటాహుటిన స్థానిక అపోలో మెడికల్ సెంటర్‌కు తరలించారు. కానీ అప్పటికే ఆ చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. విమానంలో శిశువుకు శ్వాస ఆడకపోవడం వల్లే మృతి చెందినట్టు తెలిపారు. పాప మృతితో విమాన సిబ్బంది, సంస్థ విచారం వ్యక్తం చేశారు.