భారత 15వ రాష్ట్రపతిగా ఆదివాసీ గిరిజన మహిళ ద్రౌపదీ ముర్ము జులై 25 సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ క్రమంలో రాష్ట్రపతి పదవి చేపట్టిన అతి పిన్న వయస్కురాలిగా రికార్డు సాధించారు. అయితే ఇక్కడో ఆసక్తికర అంశం ఒకటుంది. ఇప్పటివరకు 11 మంది రాష్ట్రపతులు జులై 25న ప్రమాణస్వీకారం చేసి పదవీ బాధ్యతలు చేపట్టారు. ఎలాంటి నిబంధన లేకపోయినా దేశంలో ఇదొక సాంప్రదాయంగా వస్తోంది. మొదటి రాష్ట్రపతి బాబు రాజేంద్రప్రసాద్ రెండు సార్లు జనవరి 26న, సర్వేపల్లి రాధాకృష్ణన్ 1967లో మే 13న బాధ్యతలు చేపట్టారు. తర్వాత వచ్చిన జాకీర్ హుస్సేన్, ఫక్రుద్దీన్ అలీలు పదవిలో ఉండగా మరణించడంతో వేర్వేరు తేదీల్లో ప్రమాణ స్వీకారం చేశారు. అయితే 1977లో నీలం సంజీవ రెడ్డి జులై 25న రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటినుంచి వరుసగా జ్ఞానీ జైల్ సింగ్, ఆర్ వెంకట్రామన్, శంకర్ దయాళ్ శర్మ, కేఆర్ నారాయణన్, అబ్దుల్ కలాం, ప్రతిభా పాటిల్, ప్రణబ్ ముఖర్జీ, రామ్ నాథ్ కోవింద్ వరకు అదే తేదీలో ప్రమాణ స్వీకారం చేశారు. వీరంతా పూర్తి కాలం పదవిలో కొనసాగడంతో తేదీ మారలేదు. ఆ కోవలోనే ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా జులై 25న ప్రమాణ స్వీకారం చేశారు.