పిల్లలకు ఫిడ్జెట్ టాయ్స్ అంటే ఇష్టం. అలాంటివి రూపొందించి చిన్న వయసులో పెద్ద బిజినెస్ మాగ్నెట్ గా నిలిచింది. నెలకు సుమారు 1.6కోట్లు సంపాదిస్తున్నది. ఇప్పుడు 11 యేండ్ల వయసులో రిటైర్మెంట్ తీసుకుంటున్నది. ఎందుకో తెలుసా..?
పిక్సీ కర్టిస్.. ఈ పేరు మనకు తెలియకపోవచ్చు. కానీ బొమ్మలు వాడే ప్రతీ పిల్లలకు ఈమె సుపరిచితురాలు. అతి చిన్న వయసులోనే తన పేరు మీద ఫిడ్జెట్ స్పిన్నర్స్, ఇతర బొమ్మల ఉత్పత్తి రంగంలో అడుగు పెట్టింది. ఆస్ట్రేలియాకు చెందిన ఆమె యువ పారిశ్రామిక వేత్తగా సక్సెస్ సాధించింది. ఇప్పుడు హై స్కూల్ చదువుపై దృష్టి పెట్టడానికి వ్యాపారం నుంచి రిటైర్మెంట్ ప్రకటించేసింది.
ఆన్లైన్ స్టోర్ కొనసాగింపు..
బొమ్మలతో ఆడుకునే వయసులో బొమ్మలను తయారు చేసే వ్యాపారంలో అడుగు పెట్టింది పిక్సీ. ఈ అమ్మాయి క్వీన్ రాక్సీ జాసెంకో కుమార్తె. తన తండ్రి నైపుణ్యంతోనే బొమ్మల ఉత్పత్తిని చేపట్టింది. అయితే ఇప్పుడు చదువుకు ఈ బొమ్మల ఉత్పత్తి అడ్డు వస్తుందని ఆమె కుటుంబం భావించింది. అందుకే తాము ఈ వ్యాపారాన్ని చూసుకొని కూతురికి ఒత్తిడి తగ్గించాలని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆమె తల్లి పేర్కొంది. అయితే ఆస్ట్రేలియాలో మూడు సంవత్సరాల క్రితం ప్రారంభమైన Pixie’s Pix ఆన్లైన్ స్టోర్ అలాగే కొనసాగుతుందని పిక్సీ తల్లి పేర్కొంది.
చదువు కోసమే..
పిక్సీ తన స్వంతంగా ఒక మెర్సిడెస్ బెంజ్ జీఐని కలిగి ఉంది. ఆమె 11వ పుట్టిన రోజు వేడుకకు సుమారు 33 లక్షలు ఖర్చు చేశారు. ఆమె నెల ఆదాయం సుమారు 1.6 కోట్లు. ఆమె వ్యాపార విజయం తమకెంతో సంతోషాన్నిస్తున్నది అంటున్నారు పిక్సీ తల్లిదండ్రులు. తన వ్యాపారంలో వచ్చే డబ్బును పేదలకు విరాళంగా ఇచ్చెందుకు నిర్ణయించుకున్నారు. ఇప్పటికే వారు సంవత్సరానికి కొన్ని స్వచ్ఛంద సంస్థలకు 30వేల డాలర్లు అంటే సుమారు 24 లక్షల రూపాయలు చెల్లిస్తున్నారు. ఇప్పుడు పిక్సీ కేవలం వ్యాపారానికి బ్రేక్ తీసుకుంటుందే తప్ప.. గుడ్ బై చెప్పడం లేదంటూ ఆమె తల్లిదండ్రులు చెబుతున్నారు. తన చదువు పూర్తయిన వెంటనే మళ్లీ వ్యాపార రంగంలోకి అడుగు పెడుతుంది పిక్సీ.