తెలంగాణలో పోలీస్ ఉద్యోగాల భర్తీలో భాగంగా రిక్రూట్ మెంట్ బోర్డు నిర్వహించిన ఫిజికల్ టెస్టులు ఈ నెల 5తో ముగిశాయి. దాదాపు నెలరోజుల పాటు 12 వివిధ జిల్లా కేంద్రాల్లో నిర్వహించిన ఈ టెస్టుల్లో మొత్తం 2 లక్షల 7 వేల 106 మంది హాజరయ్యారు. వీరిలో లక్షా 11 వేల 209 మంది మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించారు. ఇందులో పురుషులు 83 వేల 449 మంది కాగా, మహిళలు 27 వేల 760 మంది ఉన్నారు. శాతాల్లో చూస్తే అర్హత సాధించిన వారి శాతం 53.70 గా ఉంది. 2018 – 19లో ఇది 48.52 శాతం మాత్రమే ఉండగా, ఈ సారి కొంత పెరిగింది. మెయిన్స్ పరీక్షలు షెడ్యూల్ ప్రకారం మార్చి 12 నుంచి ఏప్రిల్ 23 వరకు నిర్వహిస్తారు. మొత్తం పోస్టులు 17,516 ఉండగా, ఒక్కో పోస్టుకు కనిష్టంగా ఆరుగురు పోటీ పడుతున్నారు. దీంతో అభ్యర్ధుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది.