కేరళలోని నిలంబూరు టేకు ప్లాంటేషన్ లో బ్రిటీష్ వారు నాటిన 114 యేండ్ల నాటి టేకు చెట్టును వేలం వేశారు. ఈ వేలం పాటలో ఈ చెట్టు ధర దాదాపు రూ. 40 లక్షల ధర పలికింది.
చెట్టు పచ్చగా కళకళలాడుతూ ఉంటే వాటి జోలికి ఎవరూ వెళ్లరు. అదే ఎండిపోయి, పడిపోతే మాత్రం దాన్ని ఏదైనా చేయాలనుకుంటారు. అటవీ శాఖ కూడా అంతే చేస్తుందట. 1909లో నాటిన చెట్టు ఎండిపోయి, పరిరక్షణ ప్లాట్ లో దానంతట అదే పడిపోవడంతో శాఖ వారు దీన్ని వేలం వేయాలని ఆలోచించారు.
వేలంలో..
114యేండ్ల కాలం నాటి చెట్టు ఇంతకాలానికి పడిపోయింది. దీంతో ఈ చెట్టును నెడుంకాయం ఫారెస్ట్ డిపోలో వేలానికి ఉంచారు. దీంట్లో బిడ్డింగ్ చాలా పోటాపోటీగా జరిగింది. చివరగా ఫిబ్రవరి 10న కేరళలోని బృందావన్ టింబర్స్ యజమాని అజీష్ కుమార్ 39.25 లక్షలకు దీన్నిసొంతం చేసుకున్నారు. 8 క్యూబిక్ మీటర్ల మందం ఉన్న కలపను మూడు ముక్కలుగా వేలం వేశారు. 3 మీటర్ల కంటే ఎక్కువ పొడవున్న ముక్క రూ.23 లక్షలు, మిగిలిన రెండు ముక్కల్లో ఒకటి రూ. 11 లక్షలు, ఇంకోటి రూ. 5.25లక్షల వరకు ధరను పలికాయి. ఇక దీన్నితరలించేందుకు, లారీ పై లోడ్ చేసేందుకు అదనంగా రూ. 15,000 చెల్లించాల్సి వచ్చింది.
అంతర్జాతీయ బ్రాండ్..
నిలంబూర్ లో ప్రపంచంలోనే అతి పురాతనమైన టేకు తోట ఉంది. దీనికి మాజీ బ్రిటీష్ కలెక్టర్ కనోలీ ప్లాట్ పేరు పెట్టారు. ఇందులో టేకు మ్యూజియం కూడా ఉంది. ప్రపంచంలోనే అతి పురాతన టేకు రకం కన్నిమరి ఉంది. ఇక్కడ టేకు తోటలు 2.31 హెక్టార్లలో విస్తరించి ఉన్నాయి. నిలంబూరు టేకు ఆ ధరతో కొత్త బెంచ్ మార్క్ సృష్టించింది. ఈ టేకు తోటకు చారిత్రక ప్రాముఖ్యత ఉంది. నిలంబరూ టేకు అంతర్జాతీయ బ్రాండ్ గా కూడా ఉంది.