చీతాలు..గత సంవత్సరం వరకు ఈ పేరు పెద్దగా ఎవరికీ తెలీదు. కానీ గతేడాది నమీబియా నుంచి విమానంలో
ఇండియాకు తీసుకురావడంతో చీతాలు బాగా పరిచయమైపోయాయి. 2022 సెప్టెంబర్ 17న తన పుట్టిన రోజు సందర్భంగా ప్రధాని మోదీ 8 చీతాలను స్వయంగా కునో నేషనల్ పార్క్‌లో విడిచి పెట్టారు. తాజాగా మరో 12 చీతాలు భారత్ గడ్డపై కాలు మోపాయి. ‘ప్రాజెక్ట్ చీతా’లో భాగంగా 7 మగ 5 ఆడ చీతాలను వాయుసేనకు చెందిన సీ-17 విమానంలో దక్షిణాఫ్రికా నుంచి గ్వాలియర్‌కు తీసుకొచ్చారు. వీటిని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్, కేంద్రమంత్ర భూపేంద్ర యాదవ్‌లు నేడు కునోనేషనల్ పార్క్ లో విడుదల చేయనున్నారు. నిబంధనల ప్రకారం ఈ 12 చీతాలు నెల రోజులు క్వారంటైన్లో ఉండనున్నాయి. ప్రస్తుతం మన దేశంలో మొత్తం 20 చీతాలు ఉన్నాయి. రానున్నరోజుల్లో వీటి సంఖ్య మరింత పెరగనుంది.
దేశంలో అంతరించిపోయిన ఈ వన్యప్రాణి జాతిని పున:ప్రవేశపెట్టేందుకు భారత్ ప్రభుత్వం నడుంబిగింది.దీని కోసం ‘ప్రాజెక్ట్ చీతా’ను ప్రారంభించింది. దీనిలో భాగంగా దక్షిణాఫ్రికాతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం వచ్చే పదేళ్ల వరకు ప్రతీ సంవత్సరం 12 చీతాలు దేశానికి రానున్నాయి. తొలి విడతలో నేడు 12 చీతాలు చేరుకున్నాయి.