జ్యోతిర్లింగాలు పరమశక్తివంతమైనవి. జ్యోతిర్లింగ అనే పదాన్ని విచ్చిన్నం చేసినప్పుడు.. జ్యోతి అనగా ప్రకాశం అని అర్థం. మొత్తంగా చూస్తే ప్రకాశవంతమైన లింగం అని అర్థం. ఈ మహాశివరాత్రి రోజున ఆ లింగాల గురించి తెలుసుకోకపోతే ఎలా? ప్రపంచంలో కేవలం 12 జ్యోతిర్లింగాలే ఉన్నాయి. భౌగోళికంగా, ఖగోళపరంగా ఎంతో విశిష్టత ఉన్నఈ కేంద్రాలను ఒక్కసారైనా దర్శించి తీరాల్సిందే! జ్యోతిర్లింగం అంటే ఇంగ్లీష్ లో ‘ఆల్మైటీ రేడియంట్ ఇన్’ అని అర్థం. ఈ పన్నెండు జ్యోతిర్లింగాలను సందర్శిస్తే భక్తులకు శివుడు మోక్షం ప్రసాదిస్తారని నమ్ముతారు.
ద్వాదశ జ్యోతిర్లింగాలు
1. సోమనాథ్ – గిర్ సోమనాథ్, గుజరాత్
భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ జ్యోతిర్లింగాల్లో ఒకటి. సోమనాథ్ మొదటి శైవ క్షేత్రం. ఆలయ వాస్తుశిల్పం చాళుక్యల శైలిని పోలి ఉంటుంది. ఈ మందరిలో శివుడు కాంతి స్తంభంగా కనపిస్తాడని నమ్ముతారు. చంద్రుడు దక్షిణ ప్రజాపతి 27మంది కుమార్తెలను వివాహం చేసుకొన్నట్లు శివ పురాణ కథలు చెబుతున్నాయి. కానీ చంద్రుడు తన భార్యల్లో రోహిణిని తప్ప మిగిలిన వారిని నిర్లక్ష్యం చేయడం వల్ల ప్రజాపతిచే శపించబడుతాడు. తన అందాన్ని మొత్తం కోల్పోతాడు. తన అందాన్ని తిరిగి పొందడానికి అతను శివుడిని పూజించాడు. సర్వశక్తిమంతుడు అతని కోరికను మన్నించి సోమనాథునిగా శాశ్వతంగా ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. కతియావాడ్ ప్రాంతంలో ఉన్న సోమనాథ్ జ్యోతిర్లింగ దేవాలయం దాదాపు పదహారు సార్లు ధ్వంసం చేశారు. మళ్లీ పునర్నిర్మించారు.
ఆలయం వేళలు : ప్రతిరోజు ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు, హారతి ఉదయం 7 గంటలు, మధ్యాహ్నం 12, రాత్రి 7గంటలకు జరుగుతుంది. జాయ్ సోమనాథ్ : ప్రతిరోజూ ఉదయం 8 నుంచి 9 గంటల మధ్య జరుగుతుంది.
ఎలా చేరుకోవాలి? : సోమనాథ్ కు సమీప రైల్వే స్టేషన్.. వెరావల్ రైల్వే స్టేషన్. ఇది భారతదేశంలో ప్రధాన నగరాలతో అనుసంధానించబడి ఉంది. సోమనాథ్ నుంచి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఈ స్టేషన్ ఉంది. ఈ దూరాన్ని ట్యాక్సీ లేదా క్యాబ్ లో చేరుకోవచ్చు.
2. నాగేశ్వర్ – దారుకావనం, గుజరాత్
గుజరాత్ లోని సౌరాష్ట్ర తీరంలో గోమతి ద్వారక, బైట్ ద్వారక మధ్య ఉన్న నాగేశ్వర్ భారతదేశంలోని ప్రసిద్ధ జ్యోతిర్లింగ దేవాలయాల్లో ఒకటి. భూగర్భంలో గర్భగుడి ఉంటుంది. కేవలం ఒకరోజనే కాదు.. సంవత్సరం పొడవునా నాగనాథ్ ఆలయాన్ని సందర్శిస్తారు. 25 మీటర్ల పొడవైన శివుని విగ్రహం, పెద్ద ఉద్యానవనం, అరేబియా సముద్రం సందర్శకులను ఆకర్షిస్తాయి.
ఆలయ వేళలు : వారంలోని అన్ని రోజుల్లో ఉదయం 5 నుంచి రాత్రి 9గంటల వరకు తెరచి ఉంటుంది. భక్తులు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు, సాయంత్రం 5 నుంచి రాత్రి 9 గంటల వరకు దర్శనానికి వెళ్లవచ్చు.
ఎల చేరుకోవాలి? : నాగేశ్వర్ కు సమీప రైల్వే స్టేషన్లు ద్వారకా స్టేషన్, వెరవాల్ స్టేషన్. ఇదికాకుండా.. జామ్ నగర్ విమానాశ్రయం కూడా ద్వారకకు సమీప విమానాశ్రయం.
3. భీమాశంకర్ – పుణే, మహారాష్ట్ర
భీమా నది ఒడ్డున భీమాశంకర్ ఆలయం ఉంది. నగారా నిర్మాణ నమూనాతో ఒక అద్భుతమైన నల్లరాతి నిర్మాణం ఇది. వన్యప్రాణుల అభయారణ్యం చుట్టూ ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. మహారాష్ట్రలోని ఈ జ్యోతిర్లింగాన్ని భీముడు -కుంభకర్ణుని కుమారుడు నిర్మించాడని నమ్ముతారు. సంవత్సరం పొడవునా, ముఖ్యంగా మహాశివరాత్రి సమయంలో పెద్ద సంఖ్యలో యాత్రికులు ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. భీమాశంకర్ ఆలయాన్ని సందర్శించే భక్తులు.. అక్కడ ఉన్న కమలాజ ఆలయాన్ని కూడా చూడాలి. పార్వతి అవతారం ఇక్కడ చూడొచ్చు.
ఆలయం వేళలు : వారంలోని అన్ని రోజులు ఉదయం 4.30నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి రాత్రి 9.30 వరకు తెరిచి ఉంటుంది. దర్శనం ఉదయం 5 గంటలకు ప్రారంభమై రాత్రి 9.30వరకు కొనసాగుతుంది. మధ్యాహ్నం హారతి సమయంలో దర్శనం 45 నిమిషాలు మూసివేస్తారు.
ఎలా చేరుకోవాలి? : భీమశంకర్ కి సమీప రైల్వే స్టేషన్ కర్జాత్ స్టేషన్ (168కి.మీ.). మిగిలిన దూరాన్ని బస్సులో లేదా రిక్షాల్లో వెళ్లవచ్చు.
4. త్రయంబకేశ్వర్ – నాసిక్, మహారాష్ట్ర
త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం గౌతమీ గంగ అని కూడా పిలుస్తారు. గోదావరి నది జన్మస్థలమైన బ్రహ్మగిరి పర్వతానికి సమీపంలో ఉంది. శివ పురాణం ప్రకారం.. గోదావరి నది, గౌతమి ఋషి ఇక్కడ నివసించమని శివుడిని వేడుకున్నాడు. అందుకే దేవుడు త్రయంబకేశ్వరుని రూపంలో ఉద్భవించాడు. ఈ జ్యోతిర్లింగం ఆకారం విశిష్టమైనది. ఇక్కడ ఒక మందిరానికి బదులుగా.. లోపల మూడు స్తంభాలు ఉంటాయి. అందులో ఒకటి.. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడిగా భావిస్తారు.
ఆలయ వేళలు : వారంలోని అన్ని రోజులు ఉదయం 5.30 నుంచి రాత్రి 9గంటల వరకు.
ఎలా చేరుకోవాలి? : ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం ఇక్కడి దగ్గరలో ఉంటుంది. ఇగత్ పురి రైల్వే స్టేషన్ దగ్గరగా ఉంటుంది. నాసిక్ లో ఉన్న త్రయంబకేశ్వర్ ను షిరడీ నుంచి రోడ్డు మార్గంలో కూడా చేరుకోవచ్చు.
5. ఘృణేశ్వర్ – ఔరంగాబాద్, మహారాష్ట్ర
ఎర్ర రాతి 5 అంతస్తుల శిఖర శైలి నిర్మాణం ఆకట్టుకునేలా ఉంటుంది. ప్రధాన గుడి దగ్గర భారీ నంది కనిపిస్తుంది. అజంతా, ఎల్లోరా గుహల సమీపంలో ఉన ఘృణేశ్వర్ ఆలయం ఒకటి. అహల్యాబాయి హోల్కర్ చేత నిర్మించబడిన ఈ ఆలయాన్ని గ్రుసోమేశ్వర, కుసుమ్ ఈశ్వర్ అని కూడా పిలుస్తారు. ఎర్ర రాతి పై చెక్కబడిన దశావతారం శిల్పం విపరీతంగా ఆకట్టుకుంటుంది.
ఆలయ వేళలు : దర్శనం కోసం ఉదయం 5.30 గంటల నుంచి రాత్రి 9.30 వరకు, శ్రావణ మాసంలో.. మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 11 గంటల వరకు ఉంటుంది. సాధారణంగా దర్శనానికి ఆ సమయంలో ఆరు గంటలు పడుతుంది.
ఎలా చేరుకోవాలి? : భారతదేశంలోని ఏ ప్రాంతం నుంచైనా ఔరంగాబాద్ కి రైలు ద్వారా చేరుకోవచ్చు. ఢిల్లీకి ఈ నగరానికి నేరుగా రైళ్లు, విమానాలున్నాయి. ఔరంగాబాద్ నుంచి ఈ ప్రాంతానికి 30కి.మీ. దూరంలో ఉంటుంది. ఇక్కడికి రోడ్డు మార్గంలో టాక్సీలో చేరుకోవచ్చు.
6. వైద్యనాథ్ – డియోఘర్, జార్ఖండ్
వైద్యనాథ్ లేదా బైద్యనాథ్, వైజినాథ్ అని కూడా ఈ పుణ్యక్షేత్రాన్ని పిలుస్తారు. సతీదేవి 52 శక్తి పీఠాల పుణ్యక్షేత్రాల్లో ఒకటి. పౌరాణిక కథ ప్రకారం.. రావణుడు శివుడికి లంకకు ఆహ్వానించాడు. అయితే రావణుడు లంకకు చేరుకునే వరకు ఎక్కడా పడుకోవద్దని ఆదేశించాడు. కానీ రావణుడు నిద్రపోవడంతో శివుడు ఇక్కడ లింగరూపంలో వైద్యనాథ్ లో ఉన్నాడని నమ్ముతారు.
ఆలయ వేళలు : ఆలయం ఏడు రోజులూ ఉదయం 4 నుంచి మధ్యాహ్నం 3.30వరకు, సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంటుంది. మహాశివరాత్రి సమయంలో ఈ సమయాలు పొడిగిస్తారు.
ఎలా చేరుకోవాలి? : జసిది జంక్షన్ నుంచి వైద్యనాథ్ కు సమీప రైల్వే స్టేషన్. రాంచీ నుంచి ఈ స్టేషన్ చేరుకోవచ్చు. ఈ ఆలయం స్టేషన్ కేవలం 15కి.మీ. దూరంలో ఉంది. అక్కడి నుంచి క్యాబ్ లేదా ఆటోలో చేరుకోవచ్చు.
7. మహాకాళేశ్వర్ – ఉజ్జయిని, మధ్యప్రదేశ్
మహాకాల్ అడవి ప్రాంతానికి దగ్గరగా ఈ దేవాలయం ఉంటుంది. ఉజ్జయిని రాజు చంద్రసేనుడి భక్తితో ప్రేరణ పొందిన ఐదేండ్ల బాలుడు ఈ మందిరాన్ని నిర్మించాడని నమ్ముతారు. క్షిప్రా నది ఒడ్డున మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగం భారతదేశంలోని ఏడు ముక్తి స్థలాల్లో ఒకటి. ఇది మానవుని శాశ్వతత్వానికి విముక్తి కలిగించే ప్రదేశం అని నమ్ముతారు.
ఆలయ వేళలు : ఉదయం 4 నుంచి రాత్రి 11 గంటల వరకు. భక్తులు ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు, సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు, రాత్రి 8నుంచి 11 గంటల వరకు దర్శనం పొందవచ్చు.
ఎలా చేరుకోవాలి? : ఇండోర్ విమానాశ్రయం (51కి.మీ.) మహాకాళేశ్వరానికి సమీపంలో ఉంటుంది. ఉజ్జయిని జంక్షన్, చింతామన్, విక్రమ్ నగర్, పింగ్లేశ్వ మహాకాళేశ్వరానికి నాలుగు సమీప రైల్వేస్టేషన్లు ఉన్నాయి.
8. ఓంకారేశ్వర్ – కంద్వా, మధ్యప్రదేశ్
ఓంకారేశ్వర్.. ‘లార్డ్ ఆఫ్ ది ఓం సౌండ్’గా అభివర్ణిస్తారు. ఇది భారతదేశంలోని అత్యంత పవిత్రమైన ప్రదేశాల్లో ఒకటి. నర్మదా నదిపై శివపురి అనే ద్వీపంలో ఉన్న ఈ ఆలయానికి చాలా పౌరాణిక కథలున్నాయి. అందులో ఒకటి.. దేవతలు, దానవుల మధ్య యుద్ధం జరిగింది. దేవతల విజయం కోసం శివుడిని ప్రార్థించారు. అప్పుడు శివుడు ఓంకారేశ్వరుడిగా కనిపించాడు. అలా ఇక్కడ కొలువై ఉన్నాడని అంటారు.
ఆలయ వేళలు : వారంలో అన్ని రోజులు ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఉదయం 5.30 నుంచి మధ్యాహ్నం 12.20 వరకు, సాయంత్రం 4 నుంచి రాత్రి 8.30 వరకు దర్శనం చేసుకోవచ్చు.
ఎలా చేరుకోవాలి ?: ఇండోర్ (77కి.మీ.), ఉజ్జయిని (133కి.మీ.) ఓంకారేశ్వర్ కి సమీప విమానాశ్రయాలు. ఇండోర్ లో రైల్వే స్టేషన్ కూడా ఉంది. ఇండోర్, ఉజ్జయిని, ఖాండ్వా చి ఓంకారేశ్వర్ కు బస్సులు కూడా నడుస్తాయి.
9. కాశీ విశ్వనాథుడు – వారణాసి, ఉత్తరప్రదేశ్
వారణాసిలోని గోల్డెన్ టెంపుల్ గా ఇది ప్రసిద్ధి చెందినది. 1780లో మరాఠా చక్రవర్తి మహారాణి అహల్యాబాయి హోల్కర్ చేత నిర్మించారు. ఈ జ్యోతిర్లింగం అన్నిటిలో ప్రముఖమైనదిగా చెప్పొచ్చు. అత్యంత ప్రాచుర్యం పొందిన 12 జ్యోతిర్లింగాల్లో ఇది ప్రధాన స్థానం సంపాదించిందని చెప్పుకోవచ్చు.
ఆలయ వేళలు : ఆలయం ప్రతి రోజు తెల్లవారు జామున 2.30 నుంచి రాత్రం 11 గంటల వరకు
మంగళహారతి : ఉదయం 3 నుంచి సాయంత్రం 4 వరకు
సర్వ దర్శనం : ఉదయం 4 నుంచి 11 వరకు
భోగ్ హారతి : ఉదయం 11.15 నుంచి మధ్యాహ్నం 12.20వరకు
సర్వ దర్శనం : మధ్యాహ్నం 12.20 నుంచి రాత్రి 7 వరకు
సంధ్యా హారతి : రాత్రి 7 నుంచి 8.15 వరకు
శయన హారతి : రాత్రి 10.30 నుంచి 11 వరకు
ఎలా చేరుకోవాలి? : వారణాసి జంక్షన్ కి రైల్వే స్టేషన్ ఉంది. ఈ నగరానికి చేరకున్నాక గుడికి ఆటోల్లో చేరుకోవచ్చు.
10. కేదారనాథ్ – కేదారనాథ్, ఉత్తరాఖండ్
హిమాలయ శ్రేణిలో 1200 అడుగుల ఎత్తులో ఉన్న కేదార్ నాథ్ జ్యోతిర్లింగం ఒకటి. చార్ ధామాల్లో ఒకటిగా దీన్ని పరిగణిస్తారు. అతి శీతల వాతావరణం, హిమపాతం కారణం వల్ల ఆరు నెలల పాటు మూసివేయబడి ఉంటుంది. కేదర్ నాథ్ వెళ్లే యాత్రికులు ముందుగా గంగోత్రి, యమునోత్రిలను సందర్శించి పవిత్ర జలాన్ని కేదార్ నాథ్ శివలింగానికి సమర్పిస్తారు. కేదార్ నాథ్ వరకు ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్లాలి. వాకింగ్ స్టిక్స్ లేదా మ్యూల్స్ లేదా డోలీలపై రైడ్ చేస్తారు.
ఆలయ వేళలు : ఉదయం 4 నుంచి మధ్యాహ్నం 12 వరకు, మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 9 వరకు
ఎలా చేరుకోవాలి? : జాలీ గ్రాంట్ సమీప విమానాశ్రయం. రిషికేశ్ కేదార్ నాథ్ కు సమీప రైల్వే స్టేషన్. సమీప రహదారి కనెక్టివిటీ గౌర్కుండ్ వరకు ఉంది. అక్కడి నుంచి కేదారానాథ్ వరకు ట్రెక్కింగ్ చేయవచ్చు.
11. రామేశ్వరం – రామేశ్వరం ఐల్యాండ్, తమిళనాడు
రాముడు రావణుడిపై అద్భుత విజయం సాధించిన తర్వాత పూజించాడని నమ్ముతారు. దేశంలోని దక్షిణాన ఉన్న జ్యోతిర్లింగంగా ప్రసిద్ధికెక్కింది. ‘దక్షిణ వారణాసి’గా ప్రసిద్ధికెక్కింది. తమిళనాడులోని మధురై మీదుగా ఇక్కడకు చేరుకుంటారు. ఈ జ్యోతిర్లింగాన్ని సందర్శించే భక్తులు ధనుష్కోడి బీచ్ ను కూడా సందర్శిస్తారు. చార్ ధామాల్లో ఇది కూడా ఒకటి.
ఆలయ వేళలు : ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 9 వరకు, రాత్రి 8 గంటల వరకు దర్శనానికి అనుమతి ఉంది.
ఎలా చేరుకోవాలి? : మధురై విమానాశ్రయం నుంచి ఇక్కడికి చేరుకోవచ్చు. చెన్నైతో సహా అనేక ప్రధాన దక్షిణ భారత నగరాల నుంచి రైలు మార్గం కూడా ఉంది.
12. మల్లికార్జునుడు – శ్రీశైలం, ఆంధ్రప్రదేశ్
దక్షిణ కైలాసంగా ఈ ప్రాంతానికి పేరు. మల్లికార్జున జ్యోతిర్లింగ దేవాలయం కృష్ణా నది ఒడ్డున శ్రీశైల పర్వతం మీద ఉంది. అందమైన వాస్తు శిల్పాలతో, గోపురాలు, ముఖ మండపాలు ఉంటాయి. భ్రమరాంబతో కూడా ఇక్కడ మల్లికార్జునుడు కొలువై ఉన్నాడు. సతీదేవి 52 శక్తి పీఠాల్లో ఇది కూడా ఒకటి. దేశంలోని గొప్ప శైవ క్షేత్రాల్లో ఇదొకటనడంలో సందేహం లేదు.
ఆలయ వేళలు : ప్రతిరోజూ ఉదయం 4.30 నుంచి రాత్రి 10గంటల వరకు తెరిచి ఉంటుంది. ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, సాయంత్రం 6.30 నుంచి రాత్రి 9గంటల వరకు దర్శనం చేసుకోవచ్చు.
ఎలా చేరుకోవాలి? : దోరణాల, మార్కర్ పూర్, కురిచేడుతో సహా అనేక పట్టణాల నుంచి రోడ్డు మార్గంలో ఇక్కడికి చేరుకోవచ్చు. మార్కాపూర్ రైల్వే స్టేషన్ సమీప రైల్వే స్టేషన్ గా చెప్పవచ్చు.