Home > Featured > శివసేనలో చీలిక.. ఎమర్జెన్సీ మీటింగుకు ఉద్ధవ్ పిలుపు

శివసేనలో చీలిక.. ఎమర్జెన్సీ మీటింగుకు ఉద్ధవ్ పిలుపు

మహారాష్ట్రలో అధికారంలో ఉన్న మహా వికాస్ అఘాడీలో కీలక పార్టీ అయిన శివసేన పార్టీలో చీలిక ప్రారంభమయింది. మంత్రి ఏక్ నాథ్ షిండే సుమారు 12 మంది ఎమ్మెల్యేలతో గుజరాత్‌లోని సూరత్‌లో ఓ రిసార్టులో బస చేసినట్టు తెలుస్తోంది. థానే ప్రాంతంలో మంత్రి ఏక్ నాథ్ షిండేకు మంచి ప్రజాదరణ ఉంది. అయితే సోమవారం ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయిన తర్వాతి రోజే ఈ ఘటన జరగడం గమనార్హం. ఈ ఎన్నికల్లో శివసేనకు 64 ఓట్లు వస్తాయని అంచనా వేయగా, 52 మాత్రమే వచ్చాయి. రిసార్టులో బస చేసిన 12 మంది ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగుకు పాల్పడినట్టు భావిస్తుండగా, 4 స్థానాలు గెలవాల్సిన బీజేపీ.. తన మద్ధతుతో ఇంకో అదనపు స్థానాన్ని గెలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ ఊహించని పరిణామంతో ఖంగుతిన్న శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే మంగళవారం తన నివాసంలో అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చారు. దాంతో ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ ఢిల్లీ పర్యటన రద్దు చేసుకోగా, సమావేశానికి ఎన్సీపీ అధినేత శరద్ పవార్ హాజరయ్యే అవకాశముంది. అటు బీజేపీ వారితో మంత్రి ఎక్ నాథ్ షిండే టచ్‌లో ఉన్నాడని ఆరోపణలు రాగా, బీజేపీ వాటిని ఖండించింది. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడానికి తగిన సమయంలో సరైన చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. కాగా, 12 మంది ఎమ్మెల్యేలు వెళ్లిపోయినంత మాత్రాన సర్కారు పడిపోదు.

Updated : 21 Jun 2022 1:27 AM GMT
Tags:    
Next Story
Share it
Top