12 months detention on Rajasingh
mictv telugu

రాజాసింగ్‌పై 12 నెలల నిర్బంధం.. జీవో జారీ

October 29, 2022

గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పీడీ చట్టం కింద నిర్బంధించిన విషయం తెలిసిందే. దానిని ప్రభుత్వం 12 నెలల పాటు పొడిగిస్తూ ఈ నెల 19న జీవో జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు శుక్రవారం నివేదించింది. పీడీ చట్టం ప్రయోగంపై సవాలు చేస్తూ రాజాసింగ్ భార్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, జస్టిస్ ఎ. అభిషేక్ రెడ్డి, జస్టిస్ శ్రీదేవిలతో కూడిన ధర్మాసనం విచారించింది. ప్రభుత్వం తరపున ప్రత్యేక న్యాయవాది ముజీబ్ కుమార్ వాదనలు వినిపించారు. కొన్ని వర్గాలను రెచ్చగొట్టేలా ప్రసంగించిన అంశాలను దృష్టిలో పెట్టుకొని పీడీ యాక్టు ప్రయోగించామని, దానిని సలహా మండలి కూడా ఆమోదించిందని కోర్టు ద‌ృష్టికి తీసుకొచ్చారు. దీంతో 12 నెలల నిర్బంధం విధిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసిందని తెలిపారు. పిటిషనర్ తరపు న్యాయవాది రామచంద్రరావు వాదిస్తూ.. చట్టానికి విరుద్ధంగా ప్రభుత్వం నిర్బంధ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. దీంతో కోర్టు జోక్యం చేసుకుంటూ నిర్బంధంపై జారీ చేసిన జీవోపై సవాలు చేశారా? అని ప్రశ్నించగా, సవరణ పిటిషన్ దాఖలు చేస్తామని రామచంద్రరావు చెప్పారు. దీంతో కోర్టు విచారణను ఈ నెల 31వ తేదీకి వాయిదా వేసింది.