12 students died in Himachal Pradesh
mictv telugu

హిమాచల్‌ప్రదేశ్‌లో 12 మంది విద్యార్థులు మృతి

July 4, 2022

హిమాచల్‌ప్రదేశ్‌లో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 12 మంది విద్యార్థులు, మరో నలుగురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనతో చిన్నారుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఘటనపై డిప్యూటీ కమిషనర్ అశుతోష్ గార్గ్ మాట్లాడుతూ..”కులు జిల్లా జంగ్లా గ్రామం సమీపంలో ఈరోజు ఉదయం 8 గంటల ప్రాంతంలో ఓ ప్రైవేటు బస్సు లోయలో పడింది. బస్సులో స్కూల్‌కు వెళ్తేన్న 16 మంది చిన్నారులతోపాటు, కొంతమంది మహిళలు కూడా ఉన్నారు. సైంజ్ ప్రాంతానికి వెళ్తోన్న స్కూల్ బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి కొండపై నుంచి లోయలో పడిపోవడంతో చిన్నారులతోపాటు మహిళలు కూడా మృతి చెందారు” అని అన్నారు.

ఘటన జరిగిన వెంటనే అక్కడున్న స్ధానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు 18 మృతదేహాలను వెలికితీసినట్లు అధికారులు తెలిపారు. మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులు, మహిళలే ఉన్నట్లు సమాచారం ఇచ్చారు. ప్రమాద సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులున్నారని, క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని వివరాలను వెల్లడించారు. ప్రమాదానికి గురైన బస్సు పూర్తిగా నుజ్జునుజ్జయిందని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు అధికారులు భావిస్తున్నారు.