ఇరాన్లో హిజాబ్ ఆందోళనలు రోజురోజుకి ఉధృతమవుతున్నాయి. నిరసనకారులు వెనక్కు తగ్గకపోవడంతో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. వేల సంఖ్యలో మహిళలు వీధుల్లోకి వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వందలాది మంది ఈ ఆందోళనలో ప్రాణాలను పోగొట్టుకున్నారు. తాజాగా మరో అంశం ఇప్పుడు సంచలనం రేపుతోంది. పోరాటానికి పిలుపునిచ్చిన విద్యార్థులంతా ఒకేసారి అనారోగ్యానికి గురవ్వడం ఆందోళన కలిగిస్తుంది. ఖరాజమీ, ఆర్క్ విశ్వవిద్యాలయాలతో సహా మరో నాలుగు యూనివర్సిటీలకు చెందిన 1200 మంది విద్యార్థులు అనారోగ్యం పాలయ్యారు. వీరంతా పోరాటానికి ఒక్కరోజు ముందు అస్వస్థతకు గురయ్యారు. భోజనం చేసిన తర్వాత వాంతులు, విరేచనాలు, తీవ్రమైన తలనొప్పి వంటి లక్షణాలతో బాధపడడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వారిపై విష ప్రయోగం జరిగిందని ది నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆరోపణలు చేసింది. దీంతో యూనివర్సిటీ కెఫెటేరియాల్లో తినకూడదని విద్యార్థులు నిర్ణయం తీసుకున్నారు.
ఈ ఏడాది సెప్టెంబర్ లో మహ్సా అమిని అనే యువతిని పోలీసులు అరెస్ట్ చేశారు. హిజాబ్‌ను సరిగ్గా ధరించ లేదనే కారణంగా అదుపులోకి తీసుకున్నారు. తర్వాత ఆమె మరణించింది. అప్పటినుంచి దేశ వ్యాప్తంగా ఆందోళనలు మొదలయ్యాయి. రకరకాల రూపాల్లో మహిళలు హిజాబ్ ధరించమని నిరసన వ్యక్తం చేస్తూనే ఉన్నారు.ముఖ్యంగా మహిళలు హిజాబ్ తీసి..జుట్టు కత్తిరించుకుని నిరసన తెలుపుతున్నారు.