పది పైసల నాణెం.. రూ.9.5 కోట్లు పెట్టి కొన్నాడు
డబ్బు విలువ డబ్బుకే తెలుసు అన్నట్టే వుంది. పాత నాణేలను ఎవరైనా కోట్లు గుమ్మరించి కొనుక్కుంటారా అంటే.. కొనుక్కుంటారనే చెప్పాలి. పది పైసల బిళ్లను దాదాపుగా రూ.10 కోట్ల వరకు పెట్టి కొనుక్కున్నారు ఒకరు. ఏంటీ పది పైసలకు అంత విలువా? ఆ నాణెంలో వున్న ప్రత్యేకత ఏంటని అంత పెట్టి కొన్నారు? అని అనుకుంటున్నారు కదూ. అదేంటో తెలుసుకుందాం. అమెరికాలోని షికాగోలో పది పైసలను వేలంపాట పెట్టారు.
దాని విలువ తెలిసినవాళ్లు చాలామంది దానిని సొంతం చేసుకోవడానికి పోటీలు పడిమరీ వేలంలో పాల్గొంటున్నారు. దానిని దక్కించుకోవాలని అందరూ తాపత్రయపడుతున్నారు. వారిలో యుటా రాష్ట్రానికి చెందిన ఒక పెద్దాయన చాలా పెద్ద మొత్తానికి పాట పాడాడు. దాదాపు రూ.9.5 కోట్లు వేలం పాట పాడి ఆ వస్తువును దక్కించుకున్నాడు. ఆయన అంత మొత్తానికి దానిని ఎందుకు దక్కించుకున్నాడని చాలామంది అడిగిన ప్రశ్నకు నిర్వాహకులు దాని గురించి వివరించారు. ‘ఈ బిళ్లను డైమ్ అంటారు. ఒక్క డాలరులో పదో వంతు దీని విలువ ఉంటుంది. అంటే రూపాయిలో పదో వంతన్నమాట. ఈ డైమ్ నాణేన్ని 1894లో ముద్రించారు. 125 ఏళ్ల పురాతనమైంది. ఇప్పటివరకు ఇలాంటి నాణేలను 24 మాత్రమే ముద్రించారు’ అని వెల్లడించారు.