ఒకరి ప్రాణాలను రక్షించడం, తనను తాను ప్రమాదంలో పడవేయడానికి అపారమైన ధైర్యం అవసరం. తన తమ్ముడి ప్రాణాలను కాపాడేందుకు 13యేండ్ల లక్ష్మీ యెడ్లేవార్ తన చర్యకు జాతీయ శౌర్య పురస్కారం( బ్రేవరీ అవార్డు)తో సత్కరించబడుతుంది.
పిల్లలు రేపటి కోసం ఆశగా ఉంటారు. వారి దయ, ధైర్యసాహసాలు అంతిమంగా దేశ భవిష్యత్తును నిర్వచిస్తాయి. ఈ చర్యలను ప్రతి సంవత్సరం గౌరవిస్తూ.. భారత ప్రభుత్వం, ఇండియన్ కౌన్సిల్ ఫర్ చైల్డ్ వెల్ఫేర్ (ఐసీసీడబ్ల్యూ) 18 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న 25మంది భారతీయ పిల్లలకు జాతీయ శౌర్య పురస్కారాలను అందచేస్తాయి. అందులో ఈ సంవత్సరం మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాకు చెందిన 13 యేండ్ల లక్ష్మీ యెడ్లేవార్ తన బంధువును విద్యుద్ఘాతం నుంచి కాపాడిన ధైర్య సాహసాలకు గాను ఈ అవార్డును అందుకోనుంది.
ఏం జరిగింది..?
సెప్టెంబర్ 2021న.. 11 యేండ్ల లక్ష్మి తన నాలుగేళ్ల బంధువు (తమ్ముడు అవుతాడు) ఆదిత్యతో కలిసి ఇంట్లో ఉంది. ఆ సమయంలో కుటుంబంలో పెద్దలందరూ పని కోసం బయటకు వెళ్లారు. ఒకరినొకరు జాగ్రత్తగా చూసుకోండని చెప్పి వెళ్లారు. ఆడుకుంటూ.. ఆదిత్య ఇంటి వెనుక వైపు వెళ్లాడు. అతను కింద పడి ఉన్నఎలక్ట్రిక్ వైర్ పై పడిపోయాడు. పక్కనే ఉన్న రెండు ఇల్లను వేరు చేసే టిన్ షెడ్డు నుంచి వైపు పడిపోవడంతో విద్యుద్ఘాతానికి గురయ్యాడు. తీగ తగిలి అతడు కేక వేయగానే లక్ష్మి రక్షించేందుకు పరిగెత్తింది. ఆదిత్యను వైరు నుంచి వేరు చేయడానికి చెక్క దొంగను తీసుకుంది. లక్ష్మి ఆదిత్యను కాపాడింది, కానీ ఆమె స్పృహ కోల్పోయింది. వీరి కేకలు విన్న చుట్టుపక్కల వాళ్లు లక్ష్మిని ఆసుపత్రికి తరలించారు. తర్వాత కోలుకుంది.
పాఠశాల పాఠాలే..
ఆ రోజు జ్ఞాపకాలను లక్ష్మి పంచుకుంది. ‘ఆదిత్యను రక్షించాలని మనసులో ఒకటే ఉంది. ఆ సమయంలో మా పాఠశాలల్లో చెప్పిన పాఠమే గుర్తొచ్చింది. అందుకే చెక్కను లాగి ఆదిత్యను కాపాడగలిగాను. ప్రసుతం నేను జిల్లా పరిషత్ పాఠశాల్లో ఎనిమిదవ తరగతి చదువుతున్నా’ అని చెప్పింది లక్ష్మి. ఆమె ధైర్యానికి మెచ్చి స్థానిక నాయకులు, పోలీసు అధికారులు ఆమెను సత్కరించారు. జనవరి 17న ఆమె బ్రెవరీ అవార్డు అందుకోవడానికి ప్రస్తుతం ఢిల్లీకి చేరుకుంది.