13-yr-old Hyderabad boy climbs Mt Kang Yatse, Mt Dzo Jongo; aims for Mt. Everest
mictv telugu

హైదరాబాద్ బాలుడి ప్రపంచ రికార్డ్..

July 27, 2022

హైదరాబాద్ కు చెందిన విశ్వనాథ కార్తికేయ(13) ప్రపంచ రికార్డు సృష్టించాడు. లడఖ్ ప్రాంతంలోని రెండు పర్వతాల(కాంగ్ యాట్సే, డీజో జోంగో)ను అధిరోహించి వరల్డ్ రికార్డు నెలకొల్పాడు. హైదరాబాద్ నగరంలోని ఓ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న విశ్వనాథ్ మాట్లాడుతూ, తాను జూలై 9న కాంగ్ యాట్సే, డీజో జోంగో పర్వత శ్రేణుల ట్రెక్కింగ్ ప్రారంభించానని తెలిపాడు. ఈ యాత్ర జూలై 22తో ముగిసిందన్నాడు. బేస్ క్యాంప్ నుంచి శిఖరాగ్రానికి చేరుకోవడం అంత సులువు కాదన్నాడు. ఎత్తయిన ప్రాంతాల్లో గాలి ఒత్తిడి తగ్గిపోవడమే దీనికి కారణమని తెలిపాడు. తాను పట్టువదలకుండా ముందుకు సాగానని తెలిపాడు. తాను పొందిన తొలి అనుభూతి మరపురానిదని చెప్పాడు. ఈ అద్భుతాన్ని సాధించేందుకు తాను ఎంతగా శ్రమించినదీ గుర్తు చేసుకున్నానని చెప్పాడు. ఇప్పుడు తన కల సాకారం అయిందని తెలిపాడు.

శిఖరాగ్రంపై కాలు మోపే సమయంలో తాను శ్వాస సంబంధిత సమస్యను తీవ్రంగా ఎదుర్కొన్నానని తెలిపాడు. గాలిలో తేమ లేకపోవడం వల్ల తన గొంతు పొడిబారిందని , ఎక్కువ దూరం నడవడం వల్ల తాను అలసిపోయానని, ఆకలి వేసిందని చెప్పాడు. గతంలో తాను వైఫల్యాను ఎదుర్కొన్నానని, గంగోత్రి సమీపంలోని మౌంట్ రుదుగైరా, రష్యాలోని ఎల్బ్రస్ పర్వతాలను అధిరోహించలేకపోయానని వాపోయాడు. అయితే ఆ సమయంలో తాను ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నానని చెప్పాడు. తన తదుపరి లక్ష్యం ఎవరెస్ట్ శిఖరారోహణ, ఏడు శిఖరాగ్రాల అధిరోహణ అని చెప్పాడు.