రియల్ రంగంలో దూసుకెళ్తున్న హైదరాబాద్ నగరం గతంలో చెరువులు, కుంటలు, జలాశయాలతో నిండుగా కళకళలాడేది. ఎటు చూసినా పచ్చదనం, తోటలతో అలరారేది. కానీ డెవలప్ అవుతున్న కొద్దీ భూముల ధరలకు రెక్కలు రావడంతో ఈ చెరువులన్నీ కబ్జాకు గురయ్యాయి. గ్రేటర్ పరిధిలో ఇప్పటివరకు మొత్తం 134 జలాశయాలు అక్రమణకు గురయ్యాయని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జాతీయ హరిత ట్రిబ్యునల్ కి నివేదిక సమర్పించింది. ఈ జలాశయాల ఎఫ్ టీఎల్ పరిధిలో 8,718, బఫర్ జోన్ లో 5,343 అక్రమ నిర్మాణాలున్నాయని నివేదికలో వెల్లడించింది. వీరందరిపై క్రిమినల్ కేసులు నమోదు చేశామని తెలిపింది. మొత్తం చెరువుల్లో కేవలం 51 మాత్రమే కబ్జాకు గురి కాకుండా ఉన్నాయని వివరించింది. ఇప్పటికే ఆయా చెరువలు ఎఫ్ టీఎల్ బౌండరీలకు సంబంధించి తుది నోటిఫికేషన్ ని హెచ్ ఎండీఏ వెబ్ సైటులో పొందుపర్చామని, నూతనంగా ఎవరైనా ఆక్రమణలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొంది. అటు చెరువుల్లో నిర్మాణాలు చేసిన వారు న్యాయస్థానాల్లో పిటిషన్లు వేయడంతో ఆయా జలాశయాల పరిధిలో ఎలాంటి డెవలప్ మెంట్ కార్యకలాపాలు చేపట్టడం సాధ్యపడడం లేదని తెలిపింది. న్యాయ చిక్కులు లేని చోట ఆక్రమణలు తొలగించి బౌండరీల చుట్టూ రక్షణ కంచె నిర్మిస్తున్నామంది. ఇందుకోసం రూ. 94 కోట్ల వ్యయం చేశామని, లేక్ ప్రొటెక్షన్ ఫోర్స్ తో పాటు చుట్టూ సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి అక్రమార్కులపై నిఘా వేశామని వెల్లడించింది.
ఇవి కూడా చదవండి :