14 female students fell ill after eating lizard in food in Jangaon District
mictv telugu

భోజనంలో బల్లి పడి 14 మంది విద్యార్థినులకు అస్వస్థత.. మంత్రి ఎర్రబెల్లి సీరియస్

October 28, 2022

14 female students fell ill after eating lizard in food in Jangaon District

భోజనంలో బల్లి పడిన ఆహారం తిని 14 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. జనగామ జిల్లా దేవరుప్పుల మండల కేంద్రంలోని కస్తూర్బా విద్యాలయంలో గురువారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. రాత్రి భోజనం చేస్తున్న సమయంలో ఎనిమిదో తరగతి విద్యార్థిని శ్రీవాణికి పెట్టిన భోజనంలో బల్లి వుండడంతో తోటి బాలికలు గుర్తించారు. దీంతో వారు భయాందోళనకు గురయ్యారు. అప్పటికే వారు భోజనం చేయగా కొంతమంది విపరీతమైన కడుపునొప్పితో బాధ పడ్డారు. మరికొంతమంది వాంతులు చేసుకున్నారు. ఆ సమయంలో బాధ్యతలు నిర్వహిస్తున్న ఉపాధ్యాయురాలు వెంటనే 108కు సమాచారం అందించగా రెండు అంబులెన్సులలో 14 మందిని జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మరునాడు విషయం తెలిసిన పిల్లల తల్లిదండ్రులు కస్తూర్బా బాలికల విద్యాలయానికి వచ్చి పాఠశాల సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల ముందు బైఠాయించి ఆందోళన నిర్వహించారు. మరికొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలను ఇంటికి తీసుకుని వెళ్ళిపోయారు.

ఈ ఘటనపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పందించారు. ప్రస్తుతం మునుగోడు పర్యటనలో ఉన్న ఆయన.. విషయం తెలిసిన వెంటనే జనగామ జిల్లా కలెక్టర్ తో మాట్లాడి అస్వస్థతకు గురైన విద్యార్థినులకు మెరుగైన వైద్యం చేయించేలా సంబంధిత శాఖలకు ఆదేశాలు ఇవ్వాలన్నారు. అవసరమైతే వారిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించాలని సూచించారు. దీనిపై విచారణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. పిల్లలకు ఇచ్చే ఆహారం విషయంలో అశ్రద్ధ వహిస్తే, నిర్లక్ష్యమే దీనికి కారణం అయితే దోషులకు శిక్ష తప్పదని హెచ్చరించారు. విద్యార్థుల తల్లిదండ్రులు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్త వహించాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు దగ్గరుండి వైద్యం చేయించాలని, స్థానిక ప్రజాప్రతినిధులకు మంత్రి సూచించారు. తల్లిదండ్రుల ఆందోళనల నేపథ్యంలో పోలీసులతో మాట్లాడి ఉద్రిక్తతలు తగ్గేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించారు.