14 MPs in Shinde category? Hotel booking extension
mictv telugu

షిండే వర్గంలోకి 14 మంది ఎంపీలు? హోటల్ బుకింగ్ గడువు పెంపు

June 28, 2022

శివసేన తిరుగుబాటు నేత షిండే వర్గంలోకి ఇప్పటికే దాదాపు 40 మంది ఎమ్మెల్యేలు చేరిపోయారు. ఇప్పుడు ఇక ఎంపీల వంతు వచ్చింది. శివసేనకు ప్రస్తుతం లోక్‌సభలో 19 మంది ఎంపీలుండగా, వారిలో 14 మంది షిండే వర్గంలోకి చేరిపోయారని విశ్వసనీయ వర్గాల సమాచారం. మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 55 కాగా, వారిలో 40 మంది ఎమ్మెల్యేలు, 14 మంది ఎంపీలతో తమదే అసలు శివసేనగా గుర్తించాలని షిండే వర్గం కోరుతోంది. ఈ నేపథ్యంలో గౌహతిలో ఎమ్మెల్యేలు బస చేసిన రాడిసన్ హోటల్ గడువు జూన్ 30 వరకు కాగా, దానిని జులై 5 వరకు పొడిగించారు. మంగళవారం వారితో భేటీ అనంతరం షిండే మీడియాతో మాట్లాడుతూ.. త్వరలో తామంతా ముంబైకి వెళ్తామని వెల్లడించారు. ఈ లోపు గవర్నర్ విశ్వాస పరీక్ష నిరూపించుకోవాల్సిందిగా ఉద్దవ్ థాకరేను కోరనున్నారని తెలుస్తోంది. దీంతో మధ్యాహ్నం రెండున్నర గంటలకు కేబినెట్ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు.

ఈ సమావేశంలో ప్రభుత్వాన్ని రద్దు చేయాలనే ప్రతిపాదన రావచ్చని ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఇదిలా ఉండగా, రెబెల్ ఎమ్మెల్యేలలో సగం మంది తమతో టచ్‌లో ఉన్నారని, వారంతా ఉద్ధవ్ థాకరేకు మద్ధతు తెలిపేందుకు సిద్ధంగా ఉన్నారని ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ మీడియాకు తెలిపారు. అటు మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఢిల్లీకి బయల్దేరారు. తాజా రాజకీయ పరిణామాలపై పార్టీ పెద్దలతో చర్చిస్తారని, అనంతరం అక్కడే షిండేతో భేటీ అవుతారని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలో ఏం జరుగనుందోనని ప్రజలు ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు.