ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ నగరంలో భారీ చోరీ జరిగింది. రూ. 140 కోట్ల విలువైన బంగారు, వజ్రాల నగలను ఎత్తుకెళ్లారు. ఇంటి దొంగలు కొట్టేశారా, అసలు దొంగలు కొట్టేశారా అనే అనుమానం కలుగుతోంది. బిర్హానా రోడ్డులో ఉన్న ఈ షాపును ఇద్దరు భాగస్వాముల మధ్య విభేదాలతో ఐదేళ్ల కిందట మూసేశారు.
దీనిపై కోర్టులో కేసు కూడా నడుస్తోంది. విచారణలో భాగంగా ఇద్దరు భాగస్వాముల సమక్షంలో పోలీసులు షాపును తెరవడానికి కోర్టు ఇటీవల అనుమతినిచ్చింది. రేపోమాపో షాపును తెరవాలని భావిస్తుండగా చోరీ సంగతి వెలుగుచూసింది. గుర్తుతెలియని వ్యక్తులు షాపులో చొరబడి 10 వేల క్యారెట్ల విలువైన వజ్రాలు, 500 కేజీల వెండి, 100 కేజీల బంగారు నగలను దోచుకున్నట్లు తేలింది. దుకాణానానికి సంబంధించిన కీలక పత్రాలు కూడా గల్లంతయ్యాయి. ఒక యజమాని ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.