శంషాబాద్ విమానాశ్రయంలో 14 కిలోల బంగారం పట్టివేత - MicTv.in - Telugu News
mictv telugu

శంషాబాద్ విమానాశ్రయంలో 14 కిలోల బంగారం పట్టివేత

December 12, 2019

14kgs of gold.

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బంగారం పట్టివేతలు పరిపాటిగా మారిపోయాయి. దొరికేవారు దొరుకుతుంటారు.. మా వరకు వచ్చినప్పుడు చూసుకుందాంలే అనుకుంటున్నారేమో బంగారం తీసుకొచ్చేవాళ్లు. తాజాగా శంషాబాద్ విమానాశ్రయంలో 14 కిలోల బంగారం(112 బిస్కెట్లు) పట్టుబడింది. బంగారం విలువ రూ.5 కోట్ల 46 లక్షలు ఉంటుందని అధికారులు వెల్లడించారు. 

దుబాయి నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల నుంచి ఈ బంగారాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్‌ఐ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎయిరిండియా విమానం ఏఐ952లో బంగారం అక్రమంగా తరలిస్తున్నారని సమాచారం అందడంతో అధికారులు తనిఖీలు చేపట్టారు. విమానంలోని సీట్ల నెంబర్ 31ఏ, 32ఏల కింద 112 బంగారం బిస్కెట్లను గుర్తించారు. చైనా, దక్షణ కొరియాకు చెందిన ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితులపై 1962 కస్టమ్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశామని తెలిపారు.