పల్లె నుంచి రాష్ట్రపతి భవన్ దాకా... - MicTv.in - Telugu News
mictv telugu

పల్లె నుంచి రాష్ట్రపతి భవన్ దాకా…

July 20, 2017

ఆ పల్లె వాసులు ఎప్పుడు ఊహించి ఉండరు..తమ గ్రామం దేశమంతా మార్మోగుతుందని… ఆ పల్లె వాసులు కలలో అనుకోని ఉండరు తమ ఊరిలో తిరిగిన వ్యక్తే రాష్ట్రపతి అవుతాడని… రైతు కుటుంబంలో పుట్టినోడే రాష్ట్రపతి భవన్ లో అడుగు పెడతాడని.. 14 వ రాష్ట్రపతిగా రామ్ నాథ్ కోవింద్ విజయం సాధించడంతో యూపీలోని పరోంక్ పల్లెవాసులు మురిసిపోతున్నారు. ఇంతకీ ఈ రామ్ నాథ్ ఎవరు..?బ్యాక్ గ్రౌండ్ ఏంటీ..?పల్లె నుంచి రాష్ట్రపతి భవన్ దాకా ఎలా అడుగులు వేశారు..?

రామ్‌నాథ్‌ కోవింద్‌ అక్టోబర్‌ 1, 1945లో ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌ దెహత్‌ జిల్లాలోని డేరాపూర్‌ తహశీల్‌లోని పరాంఖ్‌ గ్రామంలో పుట్టారు. అడ్వ‌కేట్‌గా ఆయ‌న కెరీర్‌ను మొద‌లుపెట్టారు. ఢిల్లీ హైకోర్టులో 1977 నుంచి 79 వ‌ర‌కు సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ అడ్వ‌కేట్‌గా ఉన్నారు. 1980 నుంచి 93 వ‌ర‌కు సుప్రీంకోర్టులో సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ స్టాండింగ్ కౌన్సిల్ స‌భ్యుడిగా ఉన్నారు. 1978లో ఆయ‌న సుప్రీంకోర్టులో అడ్వ‌కేట్‌-రికార్డ్‌గా ప‌నిచేశారు. ఢిల్లీ హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టులో ఆయ‌న 16 ఏళ్లు ప‌నిచేశారు. ఢిల్లీ బార్ కౌన్సిల్‌లో 1971లో రామ్‌నాథ్ న్యాయ‌వాదిగా పేరు న‌మోదు చేసుకున్నారు.
ఇక రామ్‌నాథ్ రాజ‌కీయ కెరీర్ 1994లో మొద‌లైంది. అంచెలంచెలుగా పార్టీలో కీలక నేతగా ఎదిగి యూపీ నుంచి రెండుసార్లు రాజ్యసభకు ఎంపికయ్యారు. 1994 నుంచి 2006 వరకూ రాజ్యసభ సభ్యునిగా సేవలందించారు. 1998 నుంచి 2002 వరకూ బీజేపీ దళిత్‌ మోర్చా అధ్యక్షుడిగా రామ్‌నాథ్‌ పనిచేశారు. పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా పనిచేశారు. 2015 ఆగస్టు 16 నుంచి ఆయన బిహార్‌ గవర్నర్‌గా కొనసాగారు. పార్ల‌మెంట్‌కు చెందిన‌ ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ‌, హోంశాఖ‌, పెట్రోల్ మ‌రియు ఇంధ‌నం, సామాజిక న్యాయం, లా అండ్ జ‌స్టిస్‌, రాజ్య‌స‌భ హౌజ్ క‌మిటీల్లో ఆయ‌న స‌భ్యుడిగా ఉన్నారు. రామ్‌నాథ్ భార్య పేరు స‌వితా కోవింద్‌. వీరికి ఒక కుమారుడు ఉన్నారు. ప్రస్తుతం కోవింద్ వయసు 71 ఏళ్లు.

రామ్‌నాథ్ కోవింద్ దేశానికి 14వ రాష్ట్రపతి. ఆ పదవికి ఉత్తరప్రదేశ్ నుంచి ఎన్నికైన మొదటి వ్యక్తి. అంతేకాదు దేశ అత్యున్నత పదవి అలంకరించిన రెండో దళిత నేత. దళిత వర్గాల నుంచి రాష్ట్రపతి అయిన మొదటి వ్యక్తి కేఆర్ నారాయణ్. దేశ రాజకీయాల్లో కీలకమైన ఉత్తరప్రదేశ్ ఇప్పటి వరకు 9 మంది ప్రధానమంత్రులను అందించింది. కానీ అక్కడివారెవరు రాష్ట్రపతి కాలేదు. ఈ రాష్ట్రానికి చెందిన మొహ్మద్ హిదయతుల్లా దేశానికి మొదటి తాత్కాలిక రాష్ట్రపతిగా కొంతకాలంపాటు పని చేశారు. వీవీ గిరి రాజీనామాతో ఆనాడు భారత ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న హిదయతుల్లా రాష్ట్రపతి ఎన్నిక జరిగే వరకు 1969లో జూలై 20 నుంచి ఆగస్టు 24 వరకు ఆ పదవీ బాధ్యతలను తాత్కాలికంగా నిర్వహించారు. ఇప్పుడు రామ్ నాథ్ కోవింద్ రాష్ట్రపతి కావడంతో యూపీలో సంబురాలు హోరెత్తాయి.