ఒక్కొక్కరి ఖాతాలో 15 లక్షలు.. ప్రధాని స్పందన ఇదీ.. - MicTv.in - Telugu News
mictv telugu

ఒక్కొక్కరి ఖాతాలో 15 లక్షలు.. ప్రధాని స్పందన ఇదీ..

April 24, 2018

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత లోక్‌సభ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరాయా లేదా అన్నది పక్కనబెడితే అందరికీ ఎప్పటికీ, జీవితాంతం గుర్తుండిపోయే హామీ ఒకటి ఉంది. అదేనండి రూ. 15 లక్షల హామీ. నల్లధనాన్ని వెలికి తీసి ఒక్కో పౌరుడి బ్యాంకు ఖాతాల్లో రూ. 15 లక్షలు జమచేస్తామన్న ఆయన హామీపై ఇంతవరకు ఎలాంటి స్పందనా లేదు. అయితే ప్రధానమంత్రి కార్యాలయం దీనిపై స్పందించింది.

ఆ హామీ సంగతితో తమకు సంబంధం లేదని చెప్పుకొచ్చింది. మోహన్ కుమార్ శర్మ సమాచార హక్కు కార్యకర్తకు ఈమేరకు సమాధానం ఇచ్చింది. 15 లక్షలను ప్రజల ఖాతాల్లో ఎప్పుడు వేస్తారో కచ్చితంగా ఒక తేదీ చెప్పాలని మోహన్ కోరాడు. పెద్దనోట్లను రద్దు చేసిన 2016 నవంబర్ నెలలో 26వ తేదీన దరఖాస్తు చేసుకోగా, పీఎంఓ ఇంతకాలానికి స్పందించింది. దరఖాస్తుదారు కోరిన వ్యవహారం సమాచార హక్కు చట్టం కిందికి రాదని, ఆయన కోరిన వివరాలు అసలు ‘‘సమాచారం’’ అనే నిర్వచనం కిందికి రావు, కనుక తమ వద్ద జవాబు లేదని వివరించింది. దీనిపై  మోహన్ మండిపడుతున్నారు. పీఎంఓ, ఆర్బీఐలు ప్రధాని హామీపై పెదవి విప్పడం లేదని, ఇదెక్కడి ఆర్టీఐ చట్టమని ప్రశ్నిస్తున్నారు.