జాతీయ నేర పరిశోధన సంస్థ (ఎన్ఐఏ) ఓ ఆఫర్ ప్రకటించింది. మావోయిస్టు అగ్రనేత గణపతి అలియాస్ ముప్పాళ్ల లక్ష్మణరావును పట్టిచ్చినవారికి రూ.15 లక్షలు, అతని తర్వాత స్థానంలో ఉన్న నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్‌ను పట్టించినవారికి రూ.10 లక్షల నజరానా ఇవ్వనున్నట్టు ఎన్ఐఏ ప్రకటించింది. ఈమధ్య మావోయిస్టులను, నేరస్థులను పట్టుకోవడంలో అవకతవకలు జరుగుతున్న నేపథ్యంలో ఇలా ప్రకటించడం పరిపాటిగా మారింది. వారి వివరాలను తెలిపినవారి వివరాలు చాలా గోప్యంగా వుంచుతామని కూడా హామీ ఇస్తున్నారు.ఈ క్రమంలో గణపతిని దేశంలోని మోస్ట్ వాంటెడ్ వ్యక్తిగా పేర్కొన్నారు. అతణ్ణి పట్టిచ్చినవారికి రూ.15 లక్షలు ఇస్తామని పేర్కొంది. గణపతిది కరీంనగర్ జిల్లాలోని సారంగాపూర్ గ్రామం. 2017లో బీహార్‌లోని గయ ప్రాంతంలో కనిపించినట్టు ఇంటెలిజెన్స్ నివేదికల ద్వారా తెలుస్తోంది.
వీరిద్దరి తర్వాత 258 మందితో కూడిన లిస్టును ప్రకటించింది ఎన్ఐఏ. ఈ మోస్ట్ వాంటెడ్ జాబితాలో 15 మంది మహిళలు, 15 మంది పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద నేతలు కూడా వుండటం విశేషం. లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్, హిజ్బుల్ అగ్రనేత సలాహుద్దీన్, ఉగ్రవాదులు జునైద్ అక్రమ్ మాలిక్, జకీవుర్ రెహ్మాన్, సాజిద్ మజిద్, డేవిడ్ హెడ్లీ తదితరులు కూడా లిస్టులో ఉన్నారు.