కాచిగూడ థియేటర్లో 15 ని. యాడ్స్ గోల.. పోలీస్ కేసు.. - MicTv.in - Telugu News
mictv telugu

కాచిగూడ థియేటర్లో 15 ని. యాడ్స్ గోల.. పోలీస్ కేసు..

July 19, 2019

టీవీల్లో వచ్చే సినిమా చూడాలంటే చాలా ఓపిక కావాలి. ఎందుకంటే మధ్య మధ్యలో వచ్చే యాడ్స్ వల్ల రెండున్నర గంటల సినిమా మూడు గంటలు చూడాల్సి వస్తుంది. యూట్యూబ్ వంటి సోషల్ మీడియా వేదికలలో కూడా యాడ్స్ తప్పనిసరి అయిపోయాయి. ఇదంతా ఎందుకు, ఎంచక్కా యాడ్స్ లేకుండా సినిమాను థియేటర్లో చూస్తే బాగుటుంది అనుకునేవాళ్లం కొంతకాలం క్రితం వరకు. కానీ, థియేటర్ల మీదా గురి పెట్టాయి యాడ్స్. సినిమా ప్రారంభానికి, ఇంటర్వెల్‌లో మూడు నాలుగు యాడ్స్ వేస్తుంటారు. కానీ, ఓ థియేటర్లో యాడ్స్ 15 నిమిషాల పాటు వేశారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన ఓ ప్రేక్షకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఆ థియేటర్ మీద కేసు నమోదు చేశారు. 

ఈ ఘటన హైదరాబాద్ కాచిగూడలోని మహేశ్వరి-పరమేశ్వరి మాల్‌లో ఉన్న ఐనాక్స్ లీజర్ థియేటర్‌లో చోటు చేసుకుంది. విజయ్ గోపాల్ అనే వ్యక్తి సినిమా చూడ్డానికి ఆ థియేటర్‌కు వెళ్లాడు. యాడ్స్ వస్తుంటే ఒకటి రెండు అయిపోగానే సినిమానే వేస్తారని చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నాడు. కానీ, అతనిమీద యాడ్స్ దాడి జరిగినంత పనే అయింది. సినిమా సమయానికి ప్రారంభం కాకపోగా, వరుసగా 15 నిమిషాల పాటు యాడ్స్ దుమ్మురేపాయి. దీంతో గోపాల్‌కు చికాకేసింది. వాళ్లకు నేరుగా యాడ్స్ వేయొద్దని చెబితే ప్రయోజనం వుండదని భావించాడు. వెళ్లి  సుల్తాన్ బజార్ పోలీసులకు ఫిర్యాదు. 

తన 15 నిమిషాల సమయాన్ని థియేటర్ యాజమాన్యం వృథా చేసిందని ఫిర్యాదులో విజయ్ గోపాల్ పేర్కొన్నాడు. అతని ఫిర్యాదు మేరకు పోలీసులు సదరు థియేటర్‌పై కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని విజయ్ ట్విటర్‌లో తెలిపాడు. ప్రజల సమయాన్ని వృథా చేసే హక్కు ఎవరికీ లేదని, ఇలాంటివి సహించబోమని అన్నారు.