150 అడుగుల భారీ జెండా.. నిర్మల్‌లో ఆవిష్కరించిన మంత్రి..  - MicTv.in - Telugu News
mictv telugu

150 అడుగుల భారీ జెండా.. నిర్మల్‌లో ఆవిష్కరించిన మంత్రి.. 

August 15, 2020

150 feet high indian flag .. Minister indrakaran Reddy unveiled in Nirmal ..

74వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నిర్మల్‌ పట్టణంలో 150 అడుగుల భారీ జాతీయ జెండాను మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆవిష్కరించారు. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మంత్రి ధర్మసాగర్‌ మినీ ట్యాంక్‌బండ్‌ వద్ద ఈ భారీ జాతీయ జెండాను ఏర్పాటు చేశారు. 14వ ఆర్ధిక సంఘం నిధులతో రూ.53 లక్షలతో ఈ జాతీయ పతాకాన్ని ఏర్పరిచారు. రాష్ట్రంలో అతి ఎత్తైన జెండాల్లో ఒకటైన ఈభారీ జెండాను ముంబయ్‌కి చెందిన బజాజ్‌ కంపెనీ తయారుచేసింది. 32 అడుగుల పొడవు, 48 అడుగుల వెడల్పుతో ఈ మువ్వన్నెల పతాకాన్ని ముంబైలో తయారు చేయించారు. 

నిర్మల్‌ పట్టణంలో భారీ జాతీయ జెండాను ఆవిష్కరించిన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు. కాగా, అభివృద్ధిలో నిర్మల్‌ పట్టణం మెట్రో నగరాలకు ధీటుగా అన్నిహంగులతో అభివృద్ధిలో దూసుకుపోతోందని మంత్రి అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నగరాలు, పట్టణాలను అభివృద్ధి చేసేందుకు నిధులను కేటాయించడంతో ప్రణాళికా బద్దంగా అభివృద్ధి పనులు సాగుతున్నాయని అన్నారు. కాగా, జిల్లా కేంద్రాన్ని టూరిజం స్పాట్‌గా సుందరంగా తీర్చిదిద్దేందుకు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి శ్రమిస్తున్నారు. అందులో భాగంగానే నిర్మల్‌ పట్టణంలో భారీ జాతీయ పతాకాన్ని ఏర్పాటుచేశారు. ఈ భారీ జెండాను చూడటానికి జనాలు ఉత్సాహం చూపుతున్నారు.