యూపీ అమ్మాయి అకౌంట్లోకి రూ. 10 కోట్లు - MicTv.in - Telugu News
mictv telugu

యూపీ అమ్మాయి అకౌంట్లోకి రూ. 10 కోట్లు

September 23, 2020

16-year-old girl from UP's Balia gets ₹10 crore in bank account, probe on

ఒకటో తారీకు రాగానే సగటు ఉద్యోగి ఫోన్‌లో అకౌంట్‌ను పదేపదే చెక్ చేసుకుంటుంటాడు. జీతం పడిందా లేదా అని చూసుకుని సంబరపడిపోతుంటాడు. ఎప్పుడైనా జీతం కన్నా ఎక్కువ డబ్బులు పడితే ఎగిరి గంతేస్తాడు. అలాంటిది తన అకౌంట్‌లోకి ఓ పది కోట్ల రూపాయలు పడితే భూమి మీద కాలు నిలుస్తుందా? ఓ 16 బాలికకు ఆ షాకింగ్ అనుభూతి ఎదురైంది. తన అకౌంట్‌లో పడ్డ రూ.10 కోట్లను చూసి ఆమెకు కాసేపటి వరకు బుర్ర పనిచేయలేదట. ఇది కలా నిజమా? అనే సందిగ్ధంలో పడిందట. ఉత్తరప్రదేశ్‌లోని బల్లియా జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. బల్లియా జిల్లాకు చెందిన ఓ 16 ఏళ్ల బాలిక గత రెండేళ్లుగా బాన్స్‌దిహ్‌లోని అలహాబాద్‌ బ్యాంక్‌ బ్రాంచ్‌లో ఖాతా ఉంది. 

ఈ మధ్య తన అకౌంట్‌లో బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందో తెలుసుకుందామని సదరు బాలిక బ్యాంకుకు వెళ్లి ఆరా తీసింది. బ్యాంక్ అకౌంట్‌ను అధికారులు చెక్ చేయగా.. రూ.9.99 కోట్లు ఉన్నాయని చెప్పారు. దీంతో షాక్ అయిన బాలిక వెంటనే బాన్స్‌దిహ్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో కాన్పూర్ దేహాట్ జిల్లాకు చెందిన నీలేష్ కుమార్ పేరు గల ఒక వ్యక్తి రెండేళ్ల క్రితం 16 ఏళ్ల యువకుడి వ్యక్తిగత గుర్తింపు వివరాలను కోరగా.. తన ఆధార్ కార్డు, ఫోటో కోసం సరోజ్ అనే అమ్మాయిని అడిగాడు. ప్రధాన్‌మంత్రి ఆవాస్ యోజన కింద తన ఖాతాలోకి నిధులను బదిలీ చేయడానికి ఇవి అవసరమని చెప్పాడు. అయితే నీలేష్‌ కుమార్‌ చెప్పిన నిధులు ఈ డబ్బేనా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. ప్రధాన్‌మంత్రి ఆవాస్‌ యోజన కింద ఇంత పెద్ద మొత్తంలో డబ్బు ఎవరి బ్యాంకు అకౌంట్‌లో జమ అవదని, ఇందులో ఏదో మతలబు దాగి ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఇది సైబర్‌ క్రైం దొంగల పనే అని.. సదరు బాలిక బ్యాంకు ఖాతాను వారు వాడుకుంటున్నారని చెప్పారు.