మరో ఘోరం.. దళిత బాలికను చంపేసిన తండ్రి - MicTv.in - Telugu News
mictv telugu

మరో ఘోరం.. దళిత బాలికను చంపేసిన తండ్రి

October 7, 2020

16-year-old pregnant Dalit girl incident in Shahjahanpur

హత్రాస్‌ హత్యాచారం సంఘటనను మరువకముందే యూపీలోని షహజన్‌పూర్‌లో మరో దారుణం జరిగింది. గర్భం దాల్చిందనే నెపంతో 16 ఏళ్ల దళిత బాలికను సొంత తండ్రి, అన్నలే హతమార్చారు. పెళ్లి కాకుండానే గర్భం దాల్చడంతో ఆ కుటుంబం అవమానంగా భావించింది. దీంతో సెప్టెంబర్‌ 23న తండ్రితనయులు ఆ బాలికను హతమార్చారని పోలీసులు తెలిపారు. మంగళవారం ఆమె మృతదేహం దొరకడంతో ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది. సెప్టెంబర్ 23 నుంచి ఆ బాలిక అదృశ్యం అయినప్పటికీ కుటుంబ సభ్యులు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. 

బాలికను తీవ్రంగా హింసించి గొంతు కోసి చంపినట్టు నివేదికలు వెల్లడించాయి. ఆపై బాలిక తలను శరీరం నుంచి వేరుచేసి నది ఒడ్డున ఖననం చేశారని పోలీసులు తెలిపారు. ఆ బాలిక తండ్రి నేరాన్ని అంగీకరించాడు. ఈ నేరంలో పాలుపంచుకున్న సోదరుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. తండ్రీ తనయులపై హత్యా నేరం మోపి దర్యాప్తు చేపట్టామని షహజన్‌పూర్‌ ఎస్‌ఎస్పీ ఎస్‌ ఆనంద్‌ తెలిపారు. బాలిక హత్యలో తల్లి, ఇతర బంధువులనూ ప్రశ్నించామన్నారు. బాలిక పాఠశాలకు వెళ్ళేది కాదని, ఓ బంధువు వద్ద ఉండేదని కుటుంబ సభ్యలు పోలీసులకు తెలిపారు. బాలిక గర్భం దాల్చడానికి కారకులైన వారిని పట్టుకుని తీరుతామని పోలీసులు వెల్లడించారు.