కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఆశిస్తున్న అభ్యర్థులకు శుభవార్త చెప్పింది సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు. భారత ప్రభుత్వ పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (CPCB) వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. బోర్డు జారీ చేసిన ప్రకటన సంఖ్య (02/2022) ప్రకారం, సైంటిస్ట్ B, అసిస్టెంట్ లా ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్, టెక్నికల్ సూపర్‌వైజర్, అసిస్టెంట్, అకౌంట్స్ అసిస్టెంట్, జూనియర్ టెక్నీషియన్, సీనియర్ లేబొరేటరీ అసిస్టెంట్, అప్పర్ డివిజన్ క్లర్క్, డేటా ఎంట్రీ ఆపరేటర్ (DEO గ్రేడ్-II మొత్తం 163 పోస్టులు), జూనియర్ లాబొరేటరీ అసిస్టెంట్, లోయర్ డివిజన్ క్లర్క్, ఫీల్డ్ అటెండెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్‌లను భర్తీ చేస్తున్నట్లు ప్రకటించింది.
CPCB ద్వారా ప్రకటించబడిన పోస్ట్‌లకు దరఖాస్తు చేసుకునేందుకు ఆసక్తి, అర్హతలు ఉన్న అభ్యర్థులు బోర్డు అధికారిక వెబ్‌సైట్ cpcb.nic.in నుండి రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. సంబంధిత అప్లికేషన్ పేజీలో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ప్రక్రియలో, అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆపై రిజిస్టర్డ్ ఇమెయిల్ ఐడి, పాస్‌వర్డ్ ద్వారా లాగిన్ చేసి దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు సమయంలో అభ్యర్థులు ఆన్‌లైన్ విధానం ద్వారా రూ. 1000 ఫీజు చెల్లించాలి. కొన్ని పోస్టులకు రుసుము 500 రూపాయలు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. మరోవైపు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగులు, మహిళా అభ్యర్థులందరూ ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. దరఖాస్తు ప్రక్రియ మార్చి 6 నుండి ప్రారంభమైంది. అభ్యర్థులు తమ దరఖాస్తులను మార్చి 31, 2023 వరకు సమర్పించవచ్చు.