16ఏండ్లకే బ్రెయిన్ డెడ్.. ఏడుగురికి పునర్జన్మ - MicTv.in - Telugu News
mictv telugu

16ఏండ్లకే బ్రెయిన్ డెడ్.. ఏడుగురికి పునర్జన్మ

December 21, 2021

news 01

‘అన్ని దానాలలోకెల్ల – అవయవ దానం గోప్పది’ అనే మాటకు ఆదర్శంగా నిలిచారు ఓ యువకుడి తల్లిదండ్రులు. పుట్టెడు దు:ఖంలో ఉండి కూడా తమ కొడుకు అవయవాలు దానం చేస్తే, ఇతరుల ప్రాణాలు నిలబెట్టినవారమవుతామని నిర్ణయించుకున్నారు. దీంతో తమ కొడుకు అవయవాలను దానం చేయడానికి ఒప్పుకోవడంతో… ఆ యువకుడి అవయవాలను డాక్టర్లు ఏడుగురికి అమర్చారు.

దీంతో ఏడుగురికి పునర్జన్మ లభించింది. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం పెద్దముప్పారంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఊడుగుల ఐలయ్య కొడుకు సంతోష్(16) హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలం జయగిరిలో బీసీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నాడు. ఈనెల 8న కాలేజీలో కబడ్డీ ఆడుతుండగా, సంతోష్ తీవ్రంగా‌ గాయపడ్డాడు.

దీంతో విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు హూటిహూటిన వరంగల్ ఎంజీఎం హాస్పిటల్‌కు తరలించారు. సంతోష్ పరిస్థితిని పరీక్షించిన డాక్టర్లు అప్పటికే రక్తం గడ్డకట్టినట్లు నిర్ధారించారు. వెంటనే హైదారాబాద్‌కు తీసుకెళ్లామని  తెలిపారు. దీంతో తల్లిదండ్రులు కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. సంతోష్ బ్రెయిన్ డెడ్ అయినట్లు డాక్టర్లు నిర్ధారించి, కుటుంబ సభ్యులకు తెలిపారు. దీంతో విషయం తెలుసుకున్న జీవన్ ట్రస్టు సభ్యులు హాస్పిటల్‌కు చేరుకొని, అవయవ దానం గురించి తల్లిదండ్రులకు వివరించి, ఒప్పించారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు తమ బిడ్డ ఈ లోకంలో తమతో లేకున్నా, మరొకరి శరీరంలో తన అవయవాల రూపంలో బ్రతికే ఉంటాడని నమ్ముతూ.. గొప్ప మనసుతో అంగీకరించారు. దీంతో డాక్టర్లు సంతోష్ శరీరం నుంచి తీసుకున్న అవయవాలను ఏడుగురికి అమర్చారు.