దారుణం.. నక్సల్స్ అనుకుని 17 మంది సామాన్యుల  కాల్చివేత..  - MicTv.in - Telugu News
mictv telugu

దారుణం.. నక్సల్స్ అనుకుని 17 మంది సామాన్యుల  కాల్చివేత.. 

December 3, 2019

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్‌ జిల్లా సర్కేగూడ గ్రామం 2012 జూన్  28 రాత్రి భద్రతా సిబ్బంది జరిపిన కాల్పుల్లో 17 మంది మృతిచెందారు. హతులందరూ మావోయిస్టులని భద్రతా దళాలు అప్పట్లో ప్రకటించాయి. కానీ  గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేశారు. దీంతో అప్పటి బీజేపీ ప్రభుత్వం జస్టిస్‌ వీకే అగర్వాల్‌ నేతృత్వంలో జ్యుడీషియల్‌ కమిషన్‌ను ఏర్పాటుచే సింది. కమిషన్‌ దాదాపు ఏడేళ్ల పాటు దర్యాప్తు చేసి, నివేదికను  రాష్ట్ర ప్రభుత్వానికి అందించింది. అది ఆదివారం మీడియాకు లీకైంది. ఆరోజు భద్రతా సిబ్బంది తూటాలకు బలైపోయింది గ్రామస్తులేనని అందులో ఉన్నట్లు తెలుస్తోంది.  

encounter.

వాస్తవానికి ఆ రోజు కొందరు గ్రామస్థులు ‘బీజ్‌ పందుమ్‌’ పండగపై మాట్లాడుకునేందుకు ఓ చోట సమావేశమయ్యారని తేలింది. అయితే  మావోయిస్టుల సమావేశానికి గ్రామస్తులు హాజరైనట్లు సమాచారం రావడంతో భద్రతా సిబ్బంది అక్కడకు చేరుకొని వారిపై కాల్పులు జరిపారు. అక్కడి జనం తమపై కాల్పులు జరిపారని, ఆ తర్వాత తాము ఎదురుకాల్పులు జరిపామని అప్పట్లో భద్రతా సిబ్బంది తెలిపారు. అయితే గ్రామస్తులు.. భద్రతా సిబ్బందిపై ఎలాంటి కాల్పులూ జరపలేదని తాజాగా జ్యుడీషియల్‌ దర్యాప్తులో తేలినట్లు రిపోర్ట్‌లో ఉన్నట్టు సమాచారం. 

‘గ్రామీణులు కాల్పులు జరిపి ఉంటే అక్కడే ఉన్న డీఐజీ, డిప్యూటీ కమాండెంట్‌ వెంటనే స్పందించేవారు. వారి వద్ద తుపాకులు కూడా ఉన్నాయి. సమావేశ స్థలం నుంచి ఎలాంటి కాల్పులూ జరగలేదని నాటి డిఐజీ ఎస్‌ ఎలాంగో ఆ తర్వాత అంగీకరించినట్లు సమాచారం. దీన్ని బట్టి చూస్తుంటే భద్రతా సిబ్బంది తమ పొరబాటుతోనో, కంగారుతోనో అతి సమీపం నుంచి జనంపై కాల్పులు జరిపినట్లు అర్థమవుతోందని నివేదిక పేర్కొంది. హతులు మావోయిస్టులని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలూ భద్రతా సిబ్బంది దగ్గర లేవని పేర్కొంది. ఈ నివేదిక మీడియాకు లీకవడంతో కాంగ్రెస్‌ ప్రభుత్వంపై బీజేపీ విమర్శలు చేస్తోంది.