అరేబియా సముద్రంలో ఉన్న లక్షద్వీప్ లోని 36 దీవుల్లో.. 17 దీవుల్లోకి ఇక నుంచి రాకూడదని అక్కడ మేజిస్ట్రేట్ ఉత్తర్వులు జారీ చేశారు. బయటి వ్యక్తులే కాదు.. అక్కడి వారు కూడా వాటిల్లోకి ప్రవేశించకూడదట.
లక్షద్వీప్ జిల్లా మెజిస్ట్రేట్ జాతీయ భద్రత, ప్రజల భద్రతకు సంబంధించిన సమస్యలను పేర్కొంటూ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 144 కింద ఒక ప్రకటన జారీ చేసింది.
ఎందుకలా..?
కొబ్బరికాయలు కోసిన తర్వాత వాటిని ఉంచేందుకు అక్కడి కూలీలు తాత్కాలికంగా చిన్న ఇళ్లు నిర్మించారు. అంతే తప్ప అక్కడ నివాసం ఉండరు. జనవాసాలు లేని ఆ దీవుల్లో ఉగ్రవాద లేదా స్మగ్లింగ్ కార్యకలాపాలను నిరోధించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారట. అంతేకాదు.. ఇక్కడ అక్రమ రవాణా, చట్ట విరుద్ధమైన, సామాజిక, దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు తిరుగాడుతున్నారని సమాచారం. అందుకే ఈ నిర్ణయం తీసకున్నట్లు అక్కడి అడ్మినిస్ట్రేషన్ చెప్పింది. సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ నుంచి ప్రవేశానికి అనుమతి పొందిన వారు మాత్రమే కేంద్రపాలిత ప్రాంతంలోని జనావాసాలు లేని 17 దీవుల్లోకి ప్రవేశించడానికి అనుమతించబడతారు. ఇది ఐపీసీ సెక్షన్ 188 కింద శిక్షను ఉల్లంఘిస్తే ఒకటి నుంచి ఆరు నెలల మధ్య జైలు శిక్ష లేదా జరిమానాను విధిస్తుంది.
దేశంలోని ముఖ్యమైన, కీలకమైన సంస్థలు రద్దీగా ఉండే ప్రదేశాల పై టెర్రర్ గ్రూపులు లేదా సంస్థలు దాడి చేసి ధ్వంసం చేసే ప్రమాదం ఉంది. కాబట్టి అన్ని విషయాలను పరిగణనలోకి తగిన జాగ్రత్త చర్యలు అవసరమని అక్కడి ప్రభుత్వం ఆర్డర్ వేసింది. ఇక్కడ ఈ ఏడాది మే నెలలో లక్షద్వీప్ తీరంలో రెండు మత్స్యకారుల బోట్ల నుంచి అంతర్జాతీయ మార్కెట్ లో 1500 కోట్ల విలువైన 220 కిలోల హెరాయిన్ ను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, కోస్ట్ గార్డ్ లు స్వాధీనం చేసుకున్నాయి.