తెలంగాణలో వలస పాలనకు పునాది వేసిన 17 సెప్టెంబర్ - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణలో వలస పాలనకు పునాది వేసిన 17 సెప్టెంబర్

September 13, 2017

తెలంగాణ చరిత్రలో 17 సెప్టెంబర్ 1948 కు  ప్రాధాన్యత ఉన్నదన్న విషయంలో ఎవరికీ భిన్నభిప్రాయం లేదు. ఉండనక్కరలేదు కూడా. అయితే ఇటీవల కాలంలో 17 సెప్టెంబర్ న తెలంగాణ విమోచనా దినంగా పాటించాలని , ప్రభుత్వం అధికారికంగా విమోచనా దినాన్ని నిర్వహించాలని  కొందరు డిమాండ్ చేస్తున్నారు. బిజెపి వారైతే తెలంగాణ అంతటా విమోచనా యాత్ర కూడా నిర్వహిస్తున్నది. విమోచనా దినోత్సవానికి ప్రజా మద్దతు కూడగట్టడానికి ప్రయత్నిస్తున్నది. మరాట్వాడాలో , హైదరాబాద్ కర్నాటక జిల్లాల్లో ఆయా ప్రభుత్వాలు 17 సెప్టెంబరున అధికారికంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నప్పుడు తెలంగాణలో కూడా అటువంటి ఉత్సవాలు ఎందుకు జరగకూడదు అన్న వాదనని ముందుకు తెస్తున్నారు. మరట్వాడాలో , హైదరాబాద్ కర్నాటక జిల్లాల్లో ప్రజల అనుభవాలకు, ఇక్కడ తెలంగాణలో ప్రజల అనుభవాలకు తేడా ఉన్నది. 17 సెప్టెంబరు అనంతరం తెలంగాణలో చోటు చేసుకున్న విద్రోహ రాజకీయ పరిణామాలను విశ్లేషణ చెయ్యకుండా చేస్తున్న ఈ యాత్రను రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్న డిమాండ్ గానే చూడవలసి ఉంటుంది. నిజానికి 17 సెప్టెంబరును ఎట్లా చూడాలి అన్న అంశంపై తెలంగాణ సమాజంలో భిన్నాభిప్రాయాలు ఉద్యమకాలం నుంచే ఉన్నాయి. తెలంగాణ హిస్టరీ సొసైటీ ఈ భిన్న దృక్కోణాలని క్రోడీకరిస్తూ 2009 లో ఒక పుస్తకాన్ని కూడా వెలువరించింది. 17 సెప్టెంబరును విలీనం , విమోచన, ఆక్రమణ, విముక్తి వంటి పదాలతో వర్ణిస్తున్నారు.  ఏది ఎట్లున్నా ఆ రోజున అప్పటి వరకు స్వతంత్ర సంస్థానంగా ఉన్నహైదరాబాద్ రాజ్యం భారత యూనియన్ లో విలీనం అయిందనేది ఎవరూ కాదనలేని సత్యం. (రాజ్యాంగ పరంగా 26 జనవరి 1956 నే విలీనం జరిగిందనేది కొందరి చరిత్రకారుల అభిప్రాయం). విమోచన , విముక్తి అనేటువంటి వ్యక్తీకరణలు 17 సెప్టెంబరుకు ఆపాదించడం సరి అయింది కాదనేది తెలంగాణలోని చాలా మంది చరిత్రకారుల , మేధావుల అభిప్రాయం. గత సంవత్సరం బిజెపి నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో మెజారిటీ సభ్యులు 17 సెప్టెంబరును విలీన దినంగానే పరిగణించాలని పేర్కొనడం గమనార్హం.

నిజానికి సమకాలీన చరిత్రకారులు , వ్యాఖ్యాతలు , భారత ప్రభుత్వం , భారత సైన్యం ఎవరూ కూడా ఆ సంఘటనని విమోచనగా , విముక్తిగా పేర్కొనలేదు. 1962 లో పోర్చుగీసు పాలనలో ఉన్న గోవాను భారత యూనియన్ లో విలీనం చేసే చర్యను భారత ప్రభుత్వం గోవా విముక్తిగానే పేర్కొన్నది. 1972 లో బంగ్లాదేశ్ ను పాకిస్తాన్ చెర నుండి విడిపించడానికి చేసిన సైనిక చర్యను భారత ప్రభుత్వం బంగ్లాదేశ్ విముక్తిగానే పేర్కొన్నది. కానీ సెప్టెంబర్ 12, 1948 న ప్రారంభమైన ఆపరేషన్ పోలో (మిలటరీ రహస్య పత్రాల్లో దీన్ని ఆపరేషన్ కాటర్ పిల్లర్ గా పేర్కొన్నారని మాజీ సైనికుడు కెప్టెన్ పాండురంగారెడ్డి గారు తెలిపినారు) పేరిట సాగిన సైనిక చర్యను భారత ప్రభుత్వం పోలీస్ చర్యగా పేర్కొన్నది తప్ప ఎక్కడా విమోచనా , విముక్తి అన్న పదాలను వాడలేదు. పోలీస్ యాక్షన్ గా పిలువబడిన సైనిక చర్య లక్ష్యం హైదరాబాద్ రాజ్యంలో బలపడుతున్న కంమ్యూనిస్టులని అణిచివెయ్యడం, రాజాకార్లను అణిచివేసే పేరుమీద అమాయక ముస్లింలను ఊచకోత గురిచేయ్యడమే అయ్యింది తప్ప ఆనాడు హైదరాబాద్ రాజ్య ప్రజలు అనుభవిస్తున్నటువంటి  భూస్వామ్య దోపిడీ నుండి విముక్తి మాత్రం లభించలేదు. సారాంశంలో 17 సెప్టెంబర్ 1948 అనంతరం జరిగినదేమిటి అనేది ఈసందర్భంగా విశ్లేషించుకోవాలి.

  1. అప్పటి వరకు బ్రిటిష్ సామ్రాజ్యవాదుల కేంద్రీకృత ఆధిపత్యానికి లోబడి స్వతంత్రంగా కొనసాగుతున్న హైదరాబాద్ రాజ్యం భారత యూనియన్ లో విలీనమయ్యింది.
  2. వెంటనే కాకున్నప్పటికీ రాచరిక పాలన అంతం అయి ప్రజాస్వామ్య పాలనకు మార్గం సుగమం అయ్యింది.
  3. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం వలన మూడు వేల గ్రామాల్లో భూస్వాముల అధీనంలోని 10 లక్షల ఎకరాల భూమి విముక్తం అయి రైతు కూలీల పరమయ్యింది. సైనిక చర్య అనంతరం ఈ భూమి తిరిగి భూస్వాముల పరమయినాయి. తెలంగాణ సాయుధ రైతంగ పోరాటం సాధించిన విముక్తి ఫలాలను సైనిక చర్య తిరగదోడింది.
  4. సైనిక చర్యలో రైతాంగ పోరాటానికి నాయకత్వం వహించిన కమ్యూనిస్టులను , పోరాటంలో పాల్గొన్న వేలాది మంది రైతు కూలీలు సైన్యం ఊచకోతకు గురి అయినారు.
  5. హైదరాబాద్ రాజ్యంలో, ముఖ్యంగా మరాట్వాడాలో వేలాది మంది ముస్లిం ప్రజానీకం రజాకార్ల పేరుమీద సైన్యం ఊచకోతకు బలి అయినారు. ఇందుకు పండిత్ సుందర్ లాల్ కమిటీ నిజనిర్ధారణ నివేదిక సాక్ష్యంగా ఉన్నది.
  6. సైనిక చర్య అనంతరం 1948 నుంచి 1952 దాకా హైదారాబాద్ స్టేట్ లో సైనిక పాలన కొనసాగింది. భారత ప్రభుత్వం వెల్లోడి అనే సివిల్ అధికారిని ప్రధానమంత్రి హోదాలో హైదరాబాద్ కు పంపింది. 1952 లో దేశవ్యాప్తంగా ఎన్నికలు జరిగినాయి. హైదారాబాద్ స్టేట్ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరిగినాయి. బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా ప్రజా ప్రభుత్వం ఏర్పాటు అయ్యింది. 1956 లో రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణ జరిగి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుతో తెలంగాణ తిరిగి పరాధీనమయ్యింది.
  7. విలీనం తెలంగాణలో ఆంధ్ర వలస పాలనకు పునాదిరాయి వేసింది. తెలంగాణ ప్రజలు పెనం మీద నుంచి పొయ్యిలో పడినారు. ఈ వలస పాలన నుండి తెలంగాణ విముక్తం కావడానికి 60 ఎండ్లు పట్టింది.

విశాలాంద్ర నినాదం – ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు : విద్రోహ రాజకీయాలు :

1927 లో బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇండియన్ స్టాటుటరీ కమీషన్ (Indian Statutory Commission – ఇదే సైమన్ కమీషన్ ) ముందు భాషా ప్రాతిపదికన  రాష్ట్రాల  పునర్ వ్యవస్థీకరణ  జరగాలని భారత జతీయ కాంగ్రేస్  కోరింది. ఇందులో భాగంగా ముందుగా ఆంధ్ర , ఉత్కళ్ , సింధూ , కర్నాటక రాష్ట్రాలు ఏర్పాటు చేయాలని కమీషన్ కు సూచించింది. ఆంధ్ర రాష్ట్రం కోసం అప్పటి నుండి ఉద్యమం ఊపందుకున్నది. స్వాతంత్ర్యానంతరం ఏర్పాటు చేసిన ధర్ కమీషన్ , జె వి పి కమీటీలు కూడా ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు సిఫారసు చేసినాయి. అయితే మద్రాసు నగరం ఎవరికీ చెందాలన్న అంశంపై వివాదం చెలరేగడంతో ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు వాయిదాపడింది. 1952 లో పొట్టి శ్రీరాములు ఆమరణ దీక్ష చేపట్టి 54 రోజులకు అమరుడైన తర్వాత ఆంధ్ర ప్రాంతంలో పెద్ద ఎత్తున హింసకాండ చెలరేగడంతో ప్రధానమంత్రి నెహ్రూ పొట్టి శ్రీరాములు మరణించిన నాలుగు రోజులకు ఆంధ్ర రాష్ట్ర  ఏర్పాటుని అధికారికంగా ప్రకటించినాడు. కర్నూలు రాజధానిగా 1953 అక్టోబర్ 1 న ఆంధ్ర రాష్ట్రం ఆవిర్భవించింది.

ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు అనివార్యమని 1940 దశకంలోనే రూడీ అయ్యింది. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడితే రాజధాని సమస్య ముందుకు వస్తుంది. మద్రాసుని తమిళ ప్రజలు వదులుకోరు. ఆంధ్ర ప్రాంతంలో రాజధానికి యోగ్యమైన నగరం విశాఖపట్నం తప్ప మరో నగరం లేదు. విశాఖని రాజధానిగా రాయలసీమవాసులు ఒప్పుకోరు. రాజధాని సమస్యకు తోడు వనరుల సమస్య , నిధుల సమస్య కూడా తలెత్తే అవకాశం ఉన్నదన్న సంగతి ఆంధ్ర రాజకీయ నాయకత్వానికి బాగా తెలుసు. తెలంగాణని కలుపుకొని విశాలాంధ్ర ఏర్పడితే ఈ సమస్యలన్నే తీరుతాయి. తెలంగాణలో సకల సౌకర్యాలతో నిర్మితమైన హైదరాబాద్ నగరం ఉన్నది. రాజధాని సమస్య తీరిపోతది. తెలంగాణ నేల మీద నుంచి పారుతున్న కృష్ణా , గోదావరీ నదులని మలుపుకపోవచ్చు. హైదరాబాద్ రాష్ట్రానికి వారసత్వంగా సంక్రమించిన లక్షల ఎకరాల నిజాం సర్ఫేఖాస్ భూములు హైదరాబాద్ నగరం చుట్టూనే  ఉన్నాయి. విద్యుత్తు ఉత్పత్తికి, పారిశ్రామికాభివృద్దికి అవసరమయ్యే బొగ్గు గనులు తెలంగాణలో ఉన్నాయి. తెలంగాణ సహా విశాలాంధ్ర ఏర్పడితే అన్ని సమస్యలు పరిష్కారం  అవుతాయన్న స్పృహ వారికి ఉన్నది. అందుకే ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుకు ముందే విశాలాంధ్ర భావన పురుడు పోసుకున్నది. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు ఉద్యమానికి సమాంతరంగా విశాలాంధ్ర ఉద్యమం కూడా ఊపందుకున్నది. ఈ విశాలాంధ్ర భావనకు తాత్విక , సైద్దాంతిక భూమిక కల్పించినవాడు పుచ్చలపల్లి సుందరయ్య. ఆయనకు ముందు 1930 దశకం చివరలో విశాలాంధ్ర కోసం భావ ప్రచారం చేసినవాడు మామిపూడి వెంకట రంగయ్య. 1946 లో సుందరయ్య “ విశాలాంధ్రలో ప్రజా రాజ్యం “ పేరుతో ఒక పుస్తకాన్ని రాసి విశాలాంధ్ర భావనని స్థిరపర్చినాడు. 1946 – 56 వరకు దశాబ్ద కాలంపాటు చోటు చేసుకున్న రాజకీయాలు తెలంగాణ  పరాధీనం కావడానికి దోహదం  చేసినాయి. విశాలాంధ్ర విద్రోహ రాజకీయాలకు     17 సెప్టెంబరు 1948 తర్వాత ఒక భూమిక ఏర్పడింది. ఆ తర్వాతనే తెలంగాణలో విశాలాంధ్ర భావనకు ప్రజా మద్దత్తు కూడగట్టడానికి ప్రయత్నాలు మొదలయినాయి. తెలంగాణ మేధావివర్గంలోనికి విశాలాంధ్ర భావన ఎక్కించబడింది. దాశరథి , కాళోజీ, దేవులపల్లి రామానుజరావు వంటి ప్రజా కవులు ,రచయితలు  విశాలాంధ్ర భావనకు లొంగిపోయినారు.(1969 నాటికి ఇద్దరూ తమ తప్పును తెలుసుకొని తెలంగాణ తెలంగాణవాదులుగా మారినారు ) 1949లో విశాలాంధ్ర మహాసభ ఏర్పాటు అయి అటు ఆంధ్రలో , ఇటు తెలంగాణలో ప్రచారాన్ని ఉదృతం చేసినారు. 1950 లో ఆంధ్ర రాష్ట్ర కాంగ్రేస్ కమిటీ తమ తాత్కాలిక రాజధాని మద్రాస్ అని , శాశ్విత రాజధాని హైదరాబాద్ అని తీర్మానం చేసింది. దాన్ని తర్వాత 1953 లో కొన్ని మార్పులతో తమ తాత్కాలిక రాజధాని కర్నూల్ , శాశ్విత రాజధాని హైదరాబాద్ అని తీర్మానించినారు. దీన్ని బట్టి మొదటి నుంచి వారి చూపు హైదరాబాద్ నగరం మీద , తెలంగాణ వనరుల మీద ఉన్నదని స్పష్టమవుతున్నది.

విశాలాంద్ర మహాసభ కార్యక్రమాలని తెలంగాణలో ప్రచారానికి దేవులపల్లి రామానుజరావు అండగా నిలిచినాడు. శోభ పత్రిక ద్వారా పుస్తకాలు , కరపత్రాలు వేసి,  విశాలాంధ్ర భావప్రచారం చేసినాడు. ఆంధ్ర నుంచి అయ్యదేవర కాళేశ్వరరావు ఈ కార్యక్రమాలని పర్యవేక్షించినాడు. 1950 లో వరంగల్ పట్టణంలో విశాలాంధ్ర మహాసభ సభ జరిపింది. ఈ సభకు ఆంధ్ర నుంచి ప్రకాశం పంతులు , కడప కోటిరెడ్డి , సాంబమూర్తి  , తిమ్మారెడ్డి హాజరైనారు. విశాలాంధ్ర కోసం ఉద్యమించాలని తీర్మానించినారు. 1953 ఆగస్టులో విశాలాంధ్ర సమావేశాలు హైదరాబాద్ లో జరిగినాయి. అయితే గమనించవలసిన అంశం ఏమిటంతే విశాలాంధ్ర భావనకు వ్యతిరేకంగా తెలంగాణలో ఉద్యమాలు జరిగినాయి. 1952 లో జరిగిన గైర్ ముల్కీలకు వ్యతిరేకంగా జరిగిన    “ గైర్ ముల్కీ గో బ్యాక్ “ ఉద్యమం ప్రధానమైనది. వరంగల్ లో మొదలైన గైర్ ముల్కీ గో బ్యాక్ ఉద్యమం అన్ని జిల్లాలకు పాకింది. 1952 లో ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు ఆధ్వర్యంలో హైదరాబాద్ లో ప్రజా ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత లభించిన స్వేచ్చతో  గైర్ ముల్కీ వ్యతిరేక  ఉద్యమం ఊపందుకున్నది. `వెల్లోడి పరిపాలనా కాలంలో విపరీతంగా ప్రభుత్వ ఉద్యోగాల్లోకి చొరబడిన గైర్ ముల్కీలను వెనక్కి పంపాలని , ఆ ఉద్యోగాల్లో స్థానికులను భర్తీ చెయ్యాలని విద్యార్థులు డిమాండ్ చేసినారు. గైర్ ముల్కీలను వెనక్కి పంపే బదులు విద్యార్థులపై దమనకాండకు పాల్పడింది బూర్గుల ప్రభుత్వం. బూర్గుల వ్యక్తిగతంగా  విశాలాంధ్ర భావనకు వ్యతిరేకమే అయినా ప్రభుత్వం  వందలాది మంది విద్యార్థులను అరెస్ట్ చేసి జైళ్ళ పాలు చేసింది. ఉద్యమం సందర్భంగా విద్యార్థులపై జరిపిన కాల్పుల్లో 13 మంది విద్యార్థులు మరణించినట్లుగా చరిత్ర చెబుతున్నది. గైర్ ముల్కీ ఉద్యమానికి కొండా వెంకట రంగారెడ్డి అండగా నిలిచినాడు.

1953 లో నెహ్రూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణ సంఘం ( ఫజల్ అలీ కమీషన్ ) ముందు తెలంగాణవాదులు విశాలాంధ్ర ఏర్పాటుని వ్యతిరేకిస్తూ వందలాది విజ్ఞాపన పత్రాలు సమర్పించినారు. విశాలాంధ్ర ఏర్పాటు అయితే తాము అన్ని రంగాల్లో నష్ట పోతామని , దోపిడీకి అన్యాయానికి లోనవుతామని విన్నవించినారు. విశాలాంధ్ర ఏర్పాటు వలన తెలంగాణ ఆదాయాన్ని ఆంధ్ర ప్రాంత అభ్వృద్దికి ఖర్చు పెడతారని , తెలంగాణ మిగులు నిధులతో ఆంధ్ర ప్రాంత రెవెన్యూ లోటుని భర్తీ చేస్తారని, కృష్ణా , గోదావరీ నీటి వినియోగంపై హక్కులు కోల్పోతామని , విద్యా , ఉద్యోగ రంగాల్లో తమకంటే మేలైన పరిస్థితుల్లో ఉన్న ఆంధ్రులు వెనుకబడిన తమని ముంచుతారని కమీషన్ కు వివరించినారు. (తెలంగాణ ప్రజల ఈ భయాందోళనలు అన్నీ నిజమేనని 60 ఏండ్ల సమైక్య రాష్ట్ర చరిత్ర రుజువు చేసింది) తెలంగాణ ప్రజల అనుమానాలని , భయాందోళనలని ఫజల్ అలీ కమీషన్ పరిగణనలోనికి తీసుకున్నది. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు ప్రత్యేక రాష్ట్రాలుగా కొనసాగాలని సిఫారసు చేసింది. కమీషన్ సిఫారసుతో బేంబేలెత్తిన ఆంధ్ర నాయకత్వం దిల్లీకి పరుగులు తీసింది. దిల్లీలో నెహ్రూ , పటేల్ , గోవింద్ వల్లబ్ పంత్ తదితర జాతీయ నాయకులతో తమకున్న పరిచయాల ఆధారంగా వారిని విశాలాంధ్రకు అనుకూలంగా మార్చుకోగలిగినారు. విశాలాంధ్ర  భావన వెనుక దోపిడీ దురుద్దేశపూరిత సామ్రాజ్యవాద తత్వం ఉందన్న నెహ్రూ కూడా ఫజల్ అలీ కమీషన్ సిఫారసులని తుంగలో తొక్కి ఆంధ్ర నాయకుల ఒత్తిడికి తలొగ్గి ఆంధ్ర , తెలంగాణ ప్రాంతాల విలీనాన్ని ప్రకటించినాడు. ఈ విలీన ప్రకటనకు ముందు తెలంగాణవాదిగా ఉన్న బూర్గుల రామకృష్ణారావుని విశాలాంధ్రవాదిగా మార్చడంలో ఆంధ్ర నాయకత్వం సఫలమయ్యింది. సమైక్య రాష్ట్రానికి ముఖ్యమంత్రి పదవిని ఆశ చూపి ఉంటారని చరిత్ర విశ్లేషకులు భావించినారు. (అయితే ఆయనకు ఆంధ్ర కుటిల రాజకీయులు  మొండి చేయి చూపించిన సంగతి మనం చూసిందే). బూర్గుల వైఖరిలో చోటు చేసుకున్న మార్పుతో విశాలాంధ్ర ఏర్పాటుకు మార్గం సుగమం అయ్యింది. పెద్ద మనుషుల ఒప్పందం పేరుమీద తెలంగాణకు రక్షణల హామీపత్రం రాసిచ్చినారు. 1956 నవంబరి 1 న విద్రోహ రాజకీయలదే పై చేయి అయి విశాలాంధ్ర ఏర్పాటు అయ్యింది. కాని విశాలాంధ్రలో ప్రజా రాజ్యం మాత్రం సుదూర స్వప్నంగా  మిగిలిపోయింది. రాసిచ్చిన హామీపత్రాలు నీటి మీద రాతలైనాయి. 60 ఎండ్ల సమైక్య రాష్ట్ర చరిత్రలో వివిధ సందర్భాల్లో ఏర్పడిన చట్టబద్ద సంస్థలు , రాజ్యాంగబద్ద ఉత్తర్వులు, కమీషన్ లు ,శాసనసభా కమిటీలు ఏవీ కూడా తెలంగాణకు ప్రయోజనాలు చేకూర్చలేకపోయినాయి. ఆరు దశాబ్దాల సమైక్య జీవనంలో రెండు ప్రాంతాల ప్రజల మధ్య భావసమైక్యత ఏర్పడలేదు. తెలంగాణ వలస దోపిడీకి కేంద్రంగా మారింది. సాంస్కృతిక అణిచివేతకు గురి అయ్యింది. ఇదంతా జరగడానికి 17 సెప్టెంబరు 1948 న పునాదిరాయి పడింది. ఆ రోజుకు ముందు తెలంగాణ ప్రజలు పెనం మీద ఉంటే ఆ తర్వాత పొయ్యిలో పడినట్లయ్యింది. 1 నవంబరు 1956 న విద్రోహ రాజకీయాలది పై చేయి కావడానికి నేపథ్యాన్ని ఏర్పర్చిన సెప్టెంబరు 17 , 1948 విమోచనా దినం ఎట్లవుతుంది?  తెలంగాణలో రాచరిక పాలనని అంతం చేసి ప్రజా ప్రభుత్వం ఏర్పాటు కావడానికి దోహదం చేసిననందున తెలంగాణ చరిత్రలో సెప్టెంబరు 17 , 1948 ఒక మైలు రాయి మాత్రమే. అన్ని రోజుల్లాగే అదొక సాధారణ దినంగా గడచిపోవాలే తప్ప ఉత్సవాలు దేనికి ? తెలంగాణా ప్రభుత్వం 17 సెప్టెంబరును తెలంగాణా  విమోచనా దినంగా జరపమనే డిమాండ్ కు ప్రాసంగికత లేదు.

****

శ్రీధర్ రావు దేశ్ పాండే ,