ఆత్మహత్య చేసుకుంటానని ఇంటి నుంచి బయల్దేరిన ఓ బాలుడు.. విధివశాత్తు సజీవ సమాధి అయ్యాడు. ఈ విషాద సంఘటన బెంగుళూరులోని హోస్పేట్ టౌన్ ఖాట్మండు లే అవుట్లో జరిగింది. అక్కడ నివాసముంటున్న సోమనాథ్(18) అనే విద్యార్థి ప్రైవేట్ కాలేజీలో చదువుతున్నాడు. కాలేజీలో క్లాస్‌మేట్స్‌తో చిన్న గొడవ జరగ్గా.. వారు అతణ్ని చంపుతామని బెదిరించారు. దీంతో భయపడిపోయిన సోమనాథ్ ఈ నెల 4న ఉదయం ఇంటి నుంచి బయటకు వచ్చేశాడు.
స్నేహితులు తనను చంపుతామని బెదిరించారని.. తానే చనిపోవాలని నిర్ణయించుకున్నట్టు ఒక లేఖ రాసి పెట్టి అదృశ్యమయ్యాడు. తల్లిదండ్రులు పోలీసులకు కంప్లయింట్ చేసి అతడి కోసం వెతికే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే శనివారం (7 వ తేది) ఉదయం మరతహళ్లి ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఓ ఇంటి ముందు.. ఇసుకను ట్రక్ నుంచి అన్ లోడ్ చేస్తుండగా అతడి శవం బయటపడింది. అతడి జేబులోని మాస్క్ ఆధారంగా పోలీసులు గుర్తించి సోమనాథ్ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. ఇంటి నుంచి వచ్చిన సోమనాథ్ ఖాళీ ట్రక్ పైకి ఎక్కి పడుకుని ఉంటాడని.. అతడ్ని చూడని సిబ్బంది అందులో ఇసుకను లోడ్ చేయించుకోవడం వల్ల ప్రాణాలు కోల్పోయి ఉంటాడని పోస్ట్‌మార్టమ్ చేసిన డాక్టర్లు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.