1800 crore allocation for Ayodhya Ram Temple
mictv telugu

అయోధ్య రామాలయానికి 1800 కోట్లు కేటాయింపు

September 12, 2022

అయోధ్య నగరంలో నిర్మాణం అవుతున్న రామాలయానికి రూ. 1800 కోట్లు ఖర్చు చేయాలని శ్రీరామ జన్మభూమి తీర్ధ ట్రస్టు తాజాగా నిర్ణయించింది. ఆదివారం జరిగిన ఫైజాబాద్ సర్క్యూట్ హౌస్‌ సమావేశంలో ఈ మేరకు ఆమోదం తెలిపారు. హిందూ సంప్రదాయాల ప్రకారం విగ్రహాల ఏర్పాటుకు ట్రస్టు సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. అనంతరం ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ మాట్లాడుతూ.. భక్తుల సలహాలు, సూచనలు పరిగణనలోకి తీసుకొని ట్రస్టు రామాలయం నిర్మాణం కోసం మార్గదర్శకాలను రూపొందించిందని వెల్లడించారు. ఆలయ కాంప్లెక్స్‌లో రామాయణం కాలంలోని ఇతర విగ్రహాలను ప్రతిష్టించాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఈ సమావేశంలో ట్రస్టు సభ్యలు పాల్గొనగా, మందిర నిర్మాణాన్ని వచ్చే ఏడాది డిసెంబర్ వరకు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2024 సంక్రాంతి వరకు రాముడి విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్టించాలని సభ్యులు భావిస్తున్నారు. కాగా, ఆలయ నిర్మాణం కోసం పలు కార్పొరేట్ కంపెనీలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చినా తిరస్కరించి ప్రజల నుంచి విరాళాలు సేకరించిన విషయం తెలిసిందే.