ఆన్లైన్లో లూడో గేమ్ ద్వారా పరిచయమైన వ్యక్తి కోసం పక్క దేశ సరిహద్దులు దాటి, నకిలీ పత్రాలు సృష్టించింది ఆ యువతి. అనంతరం అతడితో సహజీవనం చేసింది. తరువాత వారిద్దరూ పెళ్లి చేసుకుని కాపురం మొదలుపెట్టారు. అయితే ఈ విషయం పోలీసులకు తెలియడంతో ఆమెను అరెస్టు చేశారు. ఈ ఘటన కర్ణాటకలోని బెంగళూరులో చోటు చేసుకుంది.
ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన ములాయమ్ సింగ్ యాదవ్ (25) అనే యువకుడికి ‘లూడో గేమ్’ అంటే విపరీతమైన పిచ్చి. ఈ క్రమంలోనే ఆ ఆట అంటే ఎంతో ఇష్టమున్న పాకిస్థాన్ కు చెందిన అమ్మాయిని ఆన్ లైన్ లో కలుసుకున్నాడు. ఇద్దరి మద్య స్నేహం చిగురించింది. స్నేహం కాస్తా ప్రేమగా మారి ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో పాక్ దేశానికి చెందిన ఇక్రా జీవని(19) తన ప్రియుడిని పెళ్లి చేసుకోడానికి భారత్ లోకి అక్రమంగా ప్రవేశించింది.
ములాయమ్ సింగ్ తో కలిసి జీవించాలని నిర్ణయించుకున్న ఇక్రా జీవని, నేపాల్ మీదుగా భారత్ కు చేరుకుంది. ఈ జంట బెంగళూరులోని అయ్యప్ప స్వామి ఆలయ సమీపంలో నివాసం ఉంటున్నారు. ములాయం సింగ్ యాదవ్ తన పేరును రవ యాదవ్ గా మార్చుకున్నాడు. ఇక్రా కోసం ఆధార్ కార్డును కూడా సంపాదించాడు. భారత పాస్ పోర్టు కోసం దరఖాస్తు చేశాడు.
పాకిస్థాన్ లో నివసిస్తున్న తన ఫ్యామిలీతో మాట్లాడేందుకు ఇక్రా ప్రయత్నించగా, కేంద్ర నిఘా వర్గాలు ఇక్రాను గుర్తించాయి. రాష్ట్ర ఇంటెలిజెన్స్ ను అలర్ట్ చేయగా విషయం వెలుగులోకి వచ్చింది. అక్రమంగా భారత్ లోకి ప్రవేశించడంతో పాటు, నకిలీ పత్రాలు సంపాదించినందుకు పోలీసులు అరెస్ట్ చేశారు. ఫోర్జరీ కేసులో యువకుడిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక్రాను FRRO అధికారులకు అప్పగించారు. తదుపరి విచారణ వరకు ఆమెను మహిళా స్టేట్ హోమ్ కు రిమాండ్ చేసి తరలించారు.