సోషల్ మీడియాలో ఫేక్ వార్తలు ఎక్కువ పోయాయి. లేనిది ఉన్నట్టు..ఉన్నది లేనట్టు కట్టు కథలు అల్లి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో తప్పుడు ఉద్యోగ ప్రకటనలతో నిరుద్యోగులను అయోమయానికి గురిచేస్తున్నారు. తాజాగా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్లో 19,800 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అంటూ ఓ వార్తను సర్క్యూలేషన్ చేశారు. దీనిని నిజం అని నమ్మిన నిరుద్యోగులు భారీగా వైరల్ చేశారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి పంపడం, వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయడం వంటివి చేశారు. అయితే దీనిపై రైల్వే శాఖ స్పందించింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఫేక్ అని స్పష్టం చేసింది. తాము ఎలాంటి నోటిఫికేషన్ జారీ చేయలేదని వివరించింది. ఈ మేరకు ఓ అధికారికంగా ఓ నోటీస్ జారీ చేసింది. రైల్వే రిక్రూట్మెంట్కు సంబంధించి ఏదైనా నోటీసు, సమాచారం కోసం అభ్యర్థులు తమ అధికారిక వెబ్సైట్లను మాత్రమే సందర్శించాలని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) అభ్యర్థులకు సూచించింది.
కొందరు దళారులే ఈ ఫేక్ ఉద్యోగ నోటిఫికేషన్ను విడుదల చేసినట్టు రైల్వే అధికారులు అనుమానిస్తున్నారు. భారీగా ఉద్యోగాలు వచ్చాయని నమ్మిచి..నిరుద్యోగులను మోసం చేస్తున్నారని.. అలాంటి వారితో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఉద్యోగాలు పేరిట డబ్బులు అడిగిన వారికి ఇవ్వొద్దని చెబుతున్నారు. ఇటీవల రైల్వేలో ఉద్యోగాలంటూ ఓ స్కాం బయటపడింది. 28 మంది యువతకు ట్రైనింగ్ పేరుతో ఢిల్లీ రైల్వే స్టేషన్లో నెల రోజుల పాటు వచ్చిపోయే రైళ్లను లెక్కించాలని సూచించారు. నెల రోజుల ట్రైనింగ్ తరువాత అపాయింట్మెంట్స్ ఇచ్చారు. తీరా వాటిని రైల్వే అధికారులకు చూపించడంతో మోసపోయినట్లు అభ్యర్థులు గ్రహించారు.