సుప్రీం తీర్పు.. నవజోత్ సింగ్ సిద్ధూకు కఠిన కారాగార శిక్ష - MicTv.in - Telugu News
mictv telugu

సుప్రీం తీర్పు.. నవజోత్ సింగ్ సిద్ధూకు కఠిన కారాగార శిక్ష

May 19, 2022

భారత మాజీ క్రికెటర్ , పంజాబ్ కాంగ్రెస్ సీనియర్ నేత నవజోత్ సింగ్ సిద్ధూ జైలుశిక్షకు గురయ్యారు. 30 ఏండ్ల కిందటి ఓ కేసులో ఏడాది పాటు కఠిన కారాగార శిక్ష విధిస్తూ సుప్రీంకోర్ట్ తీర్పు వెలువరించింది. 1988 డిసెంబర్ 27న సిద్ధూ ఒక వాగ్వాదం సమయంలో గుర్నామ్ సింగ్ అనే వ్యక్తిపై దాడి చేయడంతో అతను ప్రాణాలు కోల్పోయాడు. ఈ కేసులో సుప్రీం కోర్టు తుది తీర్పును గురువారం వెల్లడించింది. ఈ ఘటనలో సిద్ధూపై ఐపీసీ సెక్షన్ 304ఏ కింద కేసు నమోదైంది. ఈ కేసు సెషన్ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు దాకా వెళ్లింది.

పాటియాలాలోని సెషన్స్ కోర్టు న్యాయమూర్తి 1999 సెప్టెంబర్ 22న ఈ కేసులో సాక్ష్యాధారాలు లేకపోవడంతో సిద్ధూ, అతని సహచరులను నిర్దోషులుగా ప్రకటించారు. దీనిపై బాధిత కుటుంబాలు పంజాబ్, హర్యానా హైకోర్టులో సవాల్ చేశాయి. 2006లో సిద్ధూను దోషిగా నిర్ధారిస్తూ ధర్మాసనం మూడేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ సిద్ధూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై సుదీర్ఘ విచారణ జరిపిన భారత అత్యున్నత న్యాయస్థానం ఏడాది జైలు శిక్షను విధిస్తూ గురువారం తుది తీర్పు వెలువరించింది.