తెలంగాణలో మళ్లీ రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈరోజు ఒక్కరోజే 199 కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్యా ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. జిల్లాల్లోనూ కరోనా విజృంభించడంతో ఆయా జిల్లా ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ జీహెచ్ఎంసీ పరిధిలో 40 కేసులు నమోదు కాగా, మహబూబ్ నగర్‌లో 3, సూర్యాపేటలో 1, నిర్మల్‌లో 1, వరంగల్ అర్బన్‌లో 2, యాదాద్రి భువనగిరి జిల్లాలో 1, మేడ్చల్ 10, జగిత్యాల 3, ఖమ్మం 9, జనగాం 1, వలస కార్మికులలో 3 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 2,698కి చేరింది.
ఇవాళ ఐదుగురు మృతిచెందగా మృతుల సంఖ్య 82కు చేరుకుంది. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 1,428కి చేరింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1,188 ఉన్నాయి. వర్షాకాలం మొదలు కాబోతుండటంతో అటు అధికారులు, ఇటు ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో ఉష్ణోగ్రతలు బాగా తగ్గిపోతే కరోనా మరింత రెచ్చిపోయే అవకాశం ఉందని అంటున్నారు. కాగా, తెలంగాణలోనూ లాక్‌డౌన్‌ను జూన్ 30 వరకు పొడిగిస్తున్నట్టు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.