రండమ్మా రండి! ములుగులో కేజీ ప్లాస్టిక్‌కు కేజీ బియ్యం - MicTv.in - Telugu News
mictv telugu

రండమ్మా రండి! ములుగులో కేజీ ప్లాస్టిక్‌కు కేజీ బియ్యం

October 25, 2019

1Kg of Rice for 1 kg of plastic.. Telangana collector sets up unique barter system.

పట్టిన భూతం అంత ఈజీగా వదులుతుందా? దానికి భరణం చెల్లించాల్సిందే. భూతం, భరణం అంటున్నారు దేని గురించి అని అనుకునేరు. మన అవసరానికి పుట్టి మన అంతానికే కాచుకు కూర్చున్న ప్లాస్టిక్‌నే భూతంగా పరిగణించాల్సి వస్తోంది. ఇక భరణం అంటారా.. దాని గురించే మాట్లాడుకుందాం. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిద్దాం.. ప్లాస్టిక్‌ను తరిమి తరిమి కొడదాం అని ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు నినదిస్తున్నాయి. కానీ, ప్లాస్టిక్ వాడకానికి బానిసలుగా మారిన మనిషిని అంత ఈజీగా దాన్నుంచి వదిలించడం కష్టంగా భావించింది ఛత్తీస్‌గడ్ ప్రభుత్వం. కిలో ప్లాస్టిక్ తీసుకొస్తే ఒక ఫుల్ మీల్స్ ఉచితంగా ఇచ్చింది. దీంతో అక్కడ ఈ ఐడియా బాగా పనిచేసింది. ఉత్తి పుణ్యానికి ఎవరూ కదలరు, మెదలరు అని భావించింది ఛత్తీస్‌గడ్ ప్రభుత్వం. అందుకే ఈ వినూత్న పద్ధతికి దారి తీసింది. 

అయితే దీనినే మన తెలంగాణ రాష్ట్రంలోని ఓ కలెక్టర్ ఆచరణలో పెడుతున్నారు. కాకపోతే అక్కడ కిలో ప్లాస్టిక్ తీసుకొస్తే మీల్స్ ఇస్తుంటే.. ఇక్కడ మాత్రం కిలో ప్లాస్టిక్ తీసుకొస్తే కిలో బియ్యం ఇస్తున్నారు. ఇంతకీ ఆయన ఏ జిల్లా కలెక్టరో తెలుసుకోవాలని ఉంది కదూ. అక్కడికే వస్తున్నాం. ఆయన పేరు సి.నారాయణ రెడ్డి, ములుగు జిల్లాకు ఆయన కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. జిల్లాలోని 174 గ్రామాల్లో ఆయన ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఒకసారి వాడి పారసేసిన ప్లాస్టిక్ చెంచాలు, గిన్నెలు, కవర్లు, స్ట్రాలు, బాటిల్స్, గ్లాసులను తీసుకుంటున్నారు. ములుగు జిల్లా పరిపాలనా యంత్రాంగం ఈ కార్యక్రమంలో పాల్గొంటుంది. గ్రామానికో షాపు అన్నట్టు ప్లాస్టిక్ తీసుకుని బియ్యం ఇస్తున్నారు.

దీనిపై కలెక్టర్ నారాయణ రెడ్డి మాట్లాడుతూ.. ‘ప్లాస్టిక్ వ్యర్థాల గురించి ప్రజలకు అవగాహన కల్పించే ప్రోత్సాహకంగా బియ్యాన్ని ఉచితంగా అందిస్తున్నాం. ములుగు జిల్లా అంటే వన్యప్రాణులు, అభయారణ్యాలు, దేవాలయాలకు ప్రసిద్ధి చెందింది. ఇవి దేశవ్యాప్తంగా వేలాది మంది పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. అధికారులు పరిశుభ్రతను కాపాడుకోవడానికి ప్రయత్నించినప్పటికీ, ప్లాస్టిక్ మాత్రం ఇంకా వృద్ధి చెందుతోంది. దీంతో వచ్చే 2020 నాటికల్లా జిల్లా మొత్తం ప్లాస్టిక్ మయం అయిపోతుందని భావించాం. అందుకే ఈ వినూత్న ఉపాయానికి తెరలేపాం. 50 టన్నుల మా టార్గెట్లో ఇప్పటివరకు 450 క్వింటాళ్ల ప్లాస్టిక్ సేకరించాం. సేకరించిన ఈ ప్లాస్టిక్‌ను రీసైక్లింగ్ సెంటర్లకు తరలిస్తున్నాం. ప్లాస్టిక్ కవర్ల అలవాటు పోవాలని బట్ట సంచులు కూడా ఇస్తున్నాం’ అని కలెక్టర్ తెలిపారు. మంచి ప్రయత్నమే కదా.. ఇలా అన్నీ జిల్లాల్లో ప్రవేశపెడితే చాలా బాగుంటుంది కదూ.