కొత్తవాళ్లకు కష్టమే.. మొత్తానికి ఇద్దరు.. - MicTv.in - Telugu News
mictv telugu

కొత్తవాళ్లకు కష్టమే.. మొత్తానికి ఇద్దరు..

December 12, 2018

తెలంగాణ ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో 1800 మంది పైచిలుకు అభ్యర్థులు పోటీపడగా వీరిలో మొదటిసారి అసెంబ్లీకి పోటీచేసిన వారూ  ఉన్నారు. మొత్తం 1800 మంది అభ్యర్థులలో 12 మంది కొత్తవారు పోటీ పడగా వారిలో కేవలం ఇద్దరు మాత్రమే గెలుపొందారు. కొత్తవారిపై అవినీతి ఆరోపణలు ఉండవు. గతంలో చేసిన సేవ ఉండదు కాబట్టి ప్రజలకు ప్రశ్నించే అవకాశం ఉండదు. దీనితో పార్టీలకు సమస్యాత్మకంగా ఉండే నియోజకవర్గాలలో, సిట్టింగ్‌లపై వ్యతిరేకత ఉన్న నియోజకవర్గాలలో కొత్త వారిని తెరపైకి తీసుకొస్తుంటాయి.

Telugu News list of the fresher candidates in telangana assembly elections

టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిగా మేడ్చల్‌ నియోజకవర్గం నుంచి తొలిసారి పోటీచేసిన చామకూర మల్లారెడ్డి భారీ మెజార్టీతో గెలిచారు. అయితే ఈయనకు రాజకీయాలు కొత్తేమీ కావు. ప్రస్తుతం మల్కాజిగిరి ఎంపీ. రెండో వ్యక్తి అంబర్‌పేటలో గెలిచిన కాలేరు వెంకటేష్‌. ఈయన ఏకంగా బీజేపీ సీనియర్‌ నేత బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డిని ఓడించారు. మిగిలిన వారిలో కొందరు తాము పోటీ చేసిన స్థానాల్లో ప్రత్యర్థులకు గట్టిపోటీ ఇవ్వగలిగినా రెండు, మూడు స్థానాలకే పరిమితమయ్యారు.

కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి మహాకూటమి అభ్యర్థిగా టీడీపీ పార్టీ తరపున నందమూరి సుహాసిని పోటీచేశారు. ఈమె రాజకీయాలకు పూర్తిగా కొత్తయినా తెలుగు రాష్ట్రాల్లో పోటీ ఆసక్తిని రేకెత్తించింది. సెటిలర్లు అధికంగా ఉన్న నియోజకవర్గం కావడంతో సుహాసిని గెలుస్తారనే  ఊహించారు. కానీ ఆమె రెండో స్థానానికే పరిమితమయ్యారు. ముషీరాబాద్‌ నుంచి పోటీచేసిన రాష్ట్ర యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు అనిల్‌కుమార్‌ యాదవ్‌, ఉప్పల్‌ నుంచి బరిలో నిలిచిన సీనియర్‌ టీడీపీ నాయకుడు దేవేందర్‌ గౌడ్‌ తనయుడు వీరేందర్‌ గౌడ్‌లు కూడా రెండో స్థానానితో సరిపెట్టుకున్నారు. మహేశ్వరం నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి శ్రీరాములు యాదవ్‌, ఖైరతాబాద్‌ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన దాసోజు శ్రవణ్‌లు మూడో స్థానంలో నిలిచారు. రాజేంద్రనగర్‌ నుంచి మజ్లిస్‌ పార్టీ అభ్యర్థిగా నిలిచిన మీర్జా రహ్మత్‌బేగ్‌, టీడీపీ అభ్యర్థి గణేష్‌ గుప్తా ఇద్దరూ కొత్తవారే. ఈ నియోకవర్గంలో మజ్లిస్ రెండో స్థానంలో, టీడీపీ మూడో స్థానంలో నిలిచాయి. శేరిలింగంపల్లిలోనూ ఇదే పరిస్థితి. ఇక్కడ టీడీపీ తరపున ఆనందప్రసాద్‌, బీజేపీ తరపున గజ్జల యోగానంద్‌ తొలిసారి అదృష్టాన్ని పరీక్షించుకోగా, వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. చాంద్రాయణగుట్ట నియోజకవర్గం నుంచి పోటీపడిన సయ్యద్‌ సహేజా కూడా రెండో స్థానంతోనే సంతృప్తి చెందాల్సి వచ్చింది.

Telugu News list of the fresher candidates in telangana assembly elections