అస్సాంలో ఘోరం.. హత్యను అడ్డుబోయిన టీచర్‌ను నరికి.. - MicTv.in - Telugu News
mictv telugu

అస్సాంలో ఘోరం.. హత్యను అడ్డుబోయిన టీచర్‌ను నరికి..

October 2, 2020

2 Brutally incident By Villagers In Assam In Suspected Witch-Hunting Case.

దేశంలోని మారుమూల ప్రాంతాల్లో ఇంకా మూఢ నమ్మకాలు రాజ్యమేలుతునే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి. సాంకేతికంగా, వైజ్ఞానికంగా ఈ సమాజం ఎంత ముందుకు వెళ్తున్నా.. ఇంకా మంత్రాలు తంత్రాలను పట్టుకుని వేలాడుతున్నారు. వాటి నెపంతో మూర్ఖులు ఇప్పటికే ఎందరో అమాయకుల ప్రాణాలు తీశారు. అస్సాంలోని ఒక గ్రామంలో అలాంటిదే ఓ ఘోరం చోటు చేసుకుంది. మంత్రాలు చేస్తోందని ఓ మహిళను గ్రామస్తులు అత్యంత దారుణంగా తల నరికి చంపేశారు. వారిని అడ్డుకోబోయిన ఓ మహిళా టీచర్‌ను కూడా అత్యంత అమానవీయంగా తల నరికి చంపేశారు. డోక్మోకా పోలీస్ స్టేషన్ పరిధిలోని లాంగ్హిన్ రహీమాపూర్‌ గ్రామంలో రామావతి హలువా(60) అనే మహిళ నివసిస్తోంది. అయితే ఆమె క్షుద్రపూజలు చేస్తుందని గ్రామంలోని ఓ వర్గం వారికి అనుమానం కలిగింది. 

ఆమెను చంపెయ్యాలని వారంతా నిర్ణయించుకున్నారు. ఓరోజు ఆయుధాలతో ఆమె ఇంట్లో ఉండగా మూకుమ్ముడిగా దాడి చేశారు. ఆ సమయంలో అక్కడే ఉన్న 28 ఏళ్ల ఉపాధ్యాయురాలు బిజోయ్ గౌర్ వారిని అడ్డుకోబోయింది. మూఢనమ్మకాలు లేవు ఏంలేవు.. మీరు అనవసరంగా అనుమానించి ఇలాంటి పనులు చేయవద్దు అని ఆమె వారిని ఆపే ప్రయత్నం చేసింది. ఆగ్రహంతో ఉన్న ఆ దుండుగులు ఆమె మాటలతో మరింత రెచ్చిపోయారు. విచక్షణా రహితంగా ఆమె మీద కూడా దాడి చేసి హత్యచేశారు. దారుణంగా ఆమె తలను కూడా మొండెం నుంచి వేరుచేశారు. అనంతరం వారి మృతదేహాలను నది దాటి దూరంగా ఉన్న కొండ ప్రాంతాలకు తీసుకువెళ్లి దహనం చేశారు. కాగా, ఈ ఘటనపై సమాచారం అందుకున్న  పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దాడికి పాల్పడిన వారందరూ ఒకే సామాజిక వర్గానికి చెందినవారని.. ఆర్థికంగా వెనుకబడినవారని  జిల్లా ఎ‍స్పీ వెల్లడించారు.