సరిహద్దులో కాపలా కాస్తున్న భారత్ సైనికులపై బంగ్లాదేశ్ ప్రజలు దాడి చేయడం కలకలం రేపుతోంది. బోర్డర్ దాటి రావొద్దు అన్నందుకు ఇద్దరు జవాన్లపై సుమారు వంద మందికి దాకా బంగ్లాదేశ్ వాసుల దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరికి సైనికులకు తీవ్ర గాయాలయ్యాయి. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని ముర్షీదాబాద్ జిల్లా బెర్హంపూర్ సెక్టార్లో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది.
నిర్మల్చర్ ఔట్ పోస్ట్ వద్ద బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) జవాన్లు గస్తీ కాస్తున్నారు. అక్కడే పశువులు మేపుతున్న కొంతమంది బంగ్లాదేశ్ గ్రామస్తులు భారత్ భూభాగంలోకి వచ్చేందుకు ప్రయత్నించారు. వారిని అడ్డుకున్న సైనికులతో గొడవకు దిగారు. ఇరువురి మధ్య ఘర్షణ ఎక్కవకావడంతో గ్రామస్థులంతా కలిసి సైనికులపై దాడి చేశారు. సుమారు వంద మంది దాకా గ్రామస్థులు పదునైన ఆయుధాలు, కట్టెలతో దాడికి దిగారు. ఈ ఘటనలోఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఆపై సైనికుల దగ్గరున్న ఆయుధాలను గ్రామస్థులు ఎత్తుకెళ్లారు. గాయపడిన సైనికులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.