2 కోట్ల అవార్డు వద్దన్న ఐపీఎస్.. పోలీసోళ్లంతా ఇలా ఉంటే.. - MicTv.in - Telugu News
mictv telugu

2 కోట్ల అవార్డు వద్దన్న ఐపీఎస్.. పోలీసోళ్లంతా ఇలా ఉంటే..

March 26, 2018

పోలీసులంటే క్రౌర్యానికి, అవినీతికి చిహ్నాలు మనదేశంలో. అయితే అందరూ అలా ఉండరు. అసలు ఏ వృత్తిలోనైనా అందరూ చెడ్డవాళ్ల ఉండరు. కొందరు చాలా నిజాయితీగా తమ పని తాము చేసుకుపోతుంటారు. విమర్శలకు కుంగిపోరు. ప్రశంసలకు పొంగిపోరు. విధ్యుక్త ధర్మమే వారికి గొప్ప అవార్డు. రూపా మౌద్గిల్‌ అలాంటి  అధికారిణే. జయలలిత నెచ్చలి శశికళకు జైల్లో వీఐపీ ట్రీట్‌మెంట్, ఇతర అక్రమాలను వెలుగులోకి తెచ్చి దేశమంతా తెలిసిపోయిన రూపా రూ. 2 కోట్ల నగదు అవార్డును గడ్డిపోచలా తోసిపుచ్చింది.

17ఏళ్ల వృత్తి జీవితంలో చక్కని పనితీరు, నీతి నిజాయితీలకు మెచ్చి ‘ నమ్మ బెంగళూరు ఫౌండేషన్‌’ అనే సంస్థ ఆమెకు ఈ అవార్డును ప్రకటించింది. రెండుకోట్ల నగదు నజరానాను తీసుకోవడానికి తానేం గొప్ప పనేమీ చేయలేదని సున్నితంగా, వినయంగా నిరాకరించింది. ‘మీకు ధన్యవాదాలు. అయితే  నా అంతరాత్మ ఈ రివార్డును తీసుకోవడానికి ఒప్పుకోవడం లేదు. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి రాజకీయ సంస్థలకు దూరంగా ఉండాలి… ప్రభుత్వ అధికారులు ఎల్లప్పుడూ నిజాయతీగా ఉండాలి. ప్రజలకు వారిపై విశ్వాసం కలగాలి’ అని ఫౌండేషన్‌కు రాసిన లేఖలో తెలిపింది. కాగా రూప సహా ఏడుగురిని ఈ అవార్డుకు ఎంపిక చేశారు.

విధుల్లో నిక్కచ్చిగా వ్యవహరించినందుకు రూప చాలాసార్లు బదిలీ అయింది. గత ఏడాది డీఐజీ(ప్రిజన్స్‌)గా ఉన్న ఆమె జైళ్లలో అక్రమాలను బయటపెట్టడంతో ట్రాఫిక్‌ విభాగానికి బదిలీ చేశారు. ప్రస్తుతం ఆమె హోమ్‌గార్డ్‌, సివిల్ డిఫెన్స్‌కు ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌గా పనిచేస్తోంది.