ఎన్‌కౌంటర్‌లో హతమైన ఇద్దరు ఉగ్రవాదులకు కరోనా - MicTv.in - Telugu News
mictv telugu

ఎన్‌కౌంటర్‌లో హతమైన ఇద్దరు ఉగ్రవాదులకు కరోనా

July 5, 2020

Terrorist

క‌శ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమైన హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. సదరు మృత‌దేహాల‌కు కరోనా ప‌రీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు క‌శ్మీర్ పోలీసులు వెల్లడించారు. మరణించిన ఉగ్రవాదుల‌కు మెడికో-లీగ‌ల్ ప‌రీక్షల్లో భాగంగా.. శ్రీన‌గ‌ర్‌లోని సీడీ ఆసుప‌త్రిలో పోస్టుమార్టంతో పాటు డీఎన్ఏ, కోవిడ్ ప‌రీక్షలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఈ పరీక్షల్లో ఉగ్రవాదుల మృతదేహాలకు కరోనా వైర‌స్ సోకినట్లు తేలిందని చెప్పారు. కుల్గాంలోని అర్రాలో శనివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఈ ఇద్దరు ఉగ్రవాదులు మృతిచెందారు. వీరిలో ఒకరిని పాకిస్తాన్‌కు చెందిన అలీ భాయ్ అలియాస్ హైదర్‌గా గుర్తించినట్లు తెలిపారు. మరో ఉగ్రవాదిని గుర్తించాల్సి ఉందని పేర్కొన్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరోనా మృతదేహాలను కొవిడ్-19 నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా బారాముల్లాలోని ప్రత్యేక ప్రాంతంలో పూడ్చిపెట్టారు. పాకిస్తాన్ కొత్త కుట్రకు తెరలేపుతూ.. భారత్‌లోకి కరోనా వైరస్‌ వ్యాప్తి చెందించడానికి ప్రయత్నిస్తున్నట్లు గుర్తించాం. జమ్మూకశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్ ఏప్రిల్‌లోనే మీడియాకు ఈ విషయాన్ని తెలిపారు. కరోనా వైరస్‌‌తో కొంత మంది ఉగ్రవాదులను జమ్మూకశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లోకి చొరబడటానికి ప్రయత్నిస్తున్నారు. కశ్మీర్‌లో కొవిడ్-19ను వ్యాప్తి చేసి అల్లకల్లోలం చేయాలనేది వారి పన్నాగం. అయితే భద్రతా బలగాలు ఈ చర్యలను దీటుగా ఎదుర్కొంటున్నాయి. కాగా, జ‌మ్మూక‌శ్మీర్‌లో జనవరి నుంచి జూన్ వరకు జరిగిన వివిధ ఎన్‌కౌంటర్లలో మొత్తం 118 ఉగ్రవాదులు హ‌త‌మైన‌ట్లు క‌శ్మీర్ ఐజీపీ విజ‌య్ కుమార్ తెలిపారు.