ఉక్రెయిన్ నుంచి 2 లక్షల మంది పిల్లలు రష్యాకు తరలింపు - MicTv.in - Telugu News
mictv telugu

ఉక్రెయిన్ నుంచి 2 లక్షల మంది పిల్లలు రష్యాకు తరలింపు

May 3, 2022

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రారంభమయి రెండు నెలలు గడచిన నేపథ్యంలో ఉక్రెయిన్ నుంచి రష్యాకు ఎంతమంది తరలివెళ్లారు అనే నివేదిక ఒకటి వెల్లడైంది. ఉక్రెయిన్ చెప్తున్న దాని ప్రకారం 11 లక్షల మందిని బలవంతంగా రష్యాకు తరలించగా, అందులో రెండు లక్షల మంది చిన్నారులు ఉన్నారని ఆరోపిస్తోంది. దీనికి సమాధానంగా రష్యా ధీటుగా స్పందించింది. ఇప్పటి వరకు మొత్తం 10 లక్షల మంది రష్యాకు వచ్చారని, అందులో రమారమి రెండు లక్షల మంది చిన్నారులు ఉన్నారనేది వాస్తవమని ప్రకటించింది. అయితే ఉక్రెయిన్ చెప్తున్నట్టు ఇది బలవంతపు తరలింపు కాదని, ప్రజలే స్వచ్ఛందంగా వచ్చారని తెలిపింది. అంతేకాక, రష్యా ఆక్రమించుకున్న భూభాగం డాన్ బాస్, డోనెట్స్క్, లుహాన్స్క్ వంటి ప్రాంతాల నుంచి మాత్రమే వలసలు సాగాయని రష్యా రక్షణ శాఖ స్పష్టం చేసింది. కేవలం సోమవారం ఒక్కరోజులోనే 11,500 మంది రష్యాకు తరలిపోగా, అందులో 1847 మంది చిన్నారులు ఉన్నారని నివేదిక పేర్కొంది. కాగా, డాన్ బాస్ కాకుండా మిగతా ప్రాంతాలైన డోనెట్స్క్, లుహాన్స్క్ ప్రాంతాలను రష్యా యుద్ధం ప్రారంభించక ముందే వాటిని స్వతంత్ర ప్రాంతాలుగా గుర్తించింది. పైగా ఈ ప్రాంతాలలో రష్యన్ అనుకూల ప్రజలు ఎక్కువగా నివసిస్తున్నారు. ఈ కారణంగానే వలసలు జరిగాయని, బలవంతపు తరలింపు కాదని రష్యా గట్టిగా వాదిస్తోంది.