కలియుగ దైవం శ్రీనివాసుడు కొలువుండే తిరుమల మరో వివాదానికి కేంద్రమైంది. ఇటీవలే డ్రోన్ ద్వారా వీడియో చిత్రీకరణ అంశం దుమారం రేపగా, తాజాగా లడ్డూ కౌంటర్లో డబ్బు చోరీకి గురైంది. సోమవారం అర్ధరాత్రి 36వ నంబర్ కౌంటర్లో కౌంటర్ బాయ్ నిద్రిస్తుండగా, చేతివాటం ప్రదర్శించిన ఓ దొంగ రూ. 2 లక్షలకు పైగా నగదు దోచుకున్నాడు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన సోమవారం అర్ధరాత్రి జరిగింది. ఘటనపై సీరియస్ అయిన టీటీడీ పోలీసులకు ఫిర్యాదు చేయగా, సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. రికార్డయిన వీడియోల ప్రకారం నిందితుడు గతంలో చోరీ చేసిన వ్యక్తిగా గుర్తించారు. అతడిని అరెస్ట్ చేయడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ ఘటనతో తిరమలలో మరోసారి భద్రతా వైఫల్యం బయటపడింది. విజిలెన్స్ లోపం ఏమైనా ఉందా? అనే కోణంలో కూడా విచారిస్తున్నారు.