2 people escape burning wreckage after their plane crashes on California freeway
mictv telugu

హైవే పై కుప్పకూలిన విమానం.. క్షణాల్లోనే కాలి బూడిదై..

August 13, 2022

2 people escape burning wreckage after their plane crashes on California freeway
హైవే పై కార్లు, ట్రక్‌లు రాకపోకలు కొనసాగిస్తున్న సమయంలోనే ఆకాశంలో నుంచి హఠాత్తుగా వచ్చిన ఓ చిన్న విమానం నడిరోడ్డుపైనే కుప్పకూలింది. ఆ వెంటనే క్షణాల్లోనే అందరూ చూస్తుండగానే మంటలు అంటుకుని కాలిబూడిదైంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలో జరిగిన ఈ ఘటనను ‘ఏబీసీ న్యూస్’ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేసింది. ఈ నెల 10 వ తేదిన కొరోనాలోని లింక్లన్ అవెన్యూలో మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది.

విమానం కూలుతున్న సమయంలో ముందు మూడు వాహనాలు వెళ్తుండగా వెనక మరికొన్ని ఉన్నాయి. అదృష్టవశాత్తు మధ్యలో ఉన్న స్థలంలో విమానం కూలడంతో పెను ప్రమాదం తప్పింది. రోడ్డుపై విమానం పడిన వెంటనే పక్కకు దూసుకుపోయింది. ఆ వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఆ చిన్న విమానంలో ఉన్న పైలట్ ఆండ్రూ చో , మరో ప్యాసింజర్ సురక్షితంగా తప్పించుకున్నారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న కొరోనా అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాద సమయంలో విమానంలో ఉన్న ఇద్దరు సురక్షితంగా తప్పించుకున్నారని, అగ్నిమాపక అధికారులు ఓ ఫేస్‌బుక్ పోస్టులో తెలిపారు.

కొరోనా మునిసిపల్ ఎయిర్‌పోర్టు నుంచి టేకాఫ్ అయిన విమానం.. తిరిగి విమానాశ్రయానికి వెళ్తున్న సమయంలో అందులో ఒక్కసారిగా పవర్ ఆగిపోయిందని పేర్కొన్నారు. దీంతో హైవే పై ల్యాండింగ్ కోసం వెతికానన్నారు. వాహనాలతో రోడ్డు రద్దీగా ఉండడంతో వాటిని ఎక్కడ ఢీకొడతానోనన్న భయం వేసిందని, అయితే, వాహనాలకు, వాహనాలకు మధ్య సరిపడా గ్యాప్ కనిపించడంతో వెంటనే ల్యాండ్ చేసేందుకు ప్రయత్నించానని పైలట్ ఆండ్రూ వివరించారు.