1947లో భారతదేశం విభజన జరిగినప్పుడు అనేక కుటుంబాలు చెల్లాచెదురయ్యాయి. ఎన్నో కుటుంబాలు వారి ఆప్తులను కోల్పోయాయి. చాలా మంది ఇప్పటికీ వారి కుటుంబీకుల జాడ తెలుసుకోలేకపోయారు. కానీ సోషల్ మీడియా పుణ్యమా ఇలా విభజన సమయంలో చెల్లాచెదురైన రెండు కుటుంబాలు మాత్రం అదృష్టం కొద్దీ మళ్లీ ఏకమయ్యాయి. పాకిస్థాన్ వేదికగా ఈ రెండు కుటుంబాలు తమ ఆప్తులను కలుసుకున్నాయి. భావోద్వేగంతో నిండిన ఇద్దరు అన్నాదమ్ముల కుటుంబాలు 75 ఏళ్ల తరువాత కలుసుకున్న వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో నెటిజన్ల హృదయాలను గెలుచుకుంటోంది.
హర్యానలోని మహేంద్రనగర్ జిల్లా, గోమ్లా గ్రామంలో గురుదేవ్ సింగ్, దయాసింగ్ లు నివసించేవారు. తండ్రి మరణంతో అన్నాదమ్ములు దేశ విభజన సమయంలో విడిపోయారు. విభజన సమయంలో గురుదేవ్ సింగ్ తండ్రి మిత్రుడైన కరీం భక్ష్ తో పాకిస్తాన్ కు వెళ్లిపోయాడు. గురుదేవ్ సింగ్ తమ్ముడు దయాసింగ్ మామతో కలిసి భారత్ లోనే ఉండిపోయాడు. అలా 75 ఏళ్ల క్రితం విడిపోయిన ఈ ఇద్దరు సోదరుల కుటుంబాలు సోషల్ మీడియా పుణ్యమా 75 ఏళ్ల తరువాత కలుసుకున్నాయి. పాకిస్థాన్ లోని కర్తార్పూర్ కారిడార్ ఈ కలయికకు వేదికైంది. రెండు కుటుంబాలు ఆలింగనం చేసుకుని పాటలు పాడుతూ వారి కలయికను పండుగలా జరుపుకున్నారు.
పాకిస్థాన్లో స్థిరపడిన గురుదేవ్ కొద్ది రోజుల క్రితమే చనిపోయాడు. మరణించడానికి ముందు గురుదేవ్ తన తమ్ముడి ఆచూకీ తెలుసుకునేందకు ఎన్నో ప్రయత్నాలు చేశాడు. భారత్ ప్రభుత్వానికి ఆచూకికోసం లేఖలు రాశాడు. కానీ ఆ ఆశ తీరకుండానే గురుదేవ్ చనిపోయాడు. తన తండ్రి చిరకాల కోరికను నెరవేర్చేందుకు గురుదేవ్ కొడుకు ముహమ్మద్ షరీఫ్ సోషల్ మీడియా ద్వారా అన్వేషణ ప్రారంభించాడు. ఎట్టకేలకు తన బాబాయి ఆచూకిని తెలుసుకున్నాడు. వారిని సంప్రదించాడు. విషయాన్ని తెలియజేశాడు. అనంతరం సిక్కుల పవిత్ర స్థలమైన కర్తార్పూర్ సాహిబ్ లో 74 ఏళ్ల తరువాత ఈ రెండు కుటుంబాలు కలుసుకున్నాయి. ఇదే క్రమంలో గురుదేవ్ కొడుకు ముహమ్మద్ తమ పూర్వికులు నివసించిన ఇంటిని సందర్శించేందుకు అనుమతి ఇవ్వాలని హర్యానాకు వచ్చేందుకు వీసాలు అందించాలని భారత్ ను విజ్ఞప్తి చేశాడు.