ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ దేహత్ జిల్లాలో దారుణం జరిగింది. దేహత్లో గల ఒక గ్రామంలో సోమవారం రోజు పోలీసులు, పరిపాలన బృందాలు అక్రమ నిర్మాణాలను జేసీబీలతో కూల్చి వేస్తున్న సందర్భంలో ఓ ఇంటికి నిప్పు అంటుకుంది. దీంతో ఆ ఇంట్లో ఉన్న 44 సంవత్సరాల మహిళ, 21 సంవత్సరాల ఆమె కూతురు అగ్నికి ఆహుతయ్యారు. వారిని కాపాడే క్రమంలో ఆ మహిళ భర్తకు గాయాలయ్యాయి. కాగా ప్రభుత్వ అధికారులే గుడిసెకు నిప్పంటించారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఆక్రమణ స్థలంలో గుడిసెను నిర్మించారనే కారణంతో బాధిత కుటుంబంపై అధికారులు దాడి చేశారని.. కావాలనే గుడిసెకు నిప్పంటిచారని చెబుతున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణ గోపాల్ అనే వ్యక్తి గుడిసె మంటల్లో కాలిపోయింది. ప్రమాదంలో కృష్ణ గోపాల్ భార్య.. ప్రమీలా దీక్షిత్, అతని కూతురు నేహ మంటల్లో సజీవ దహనం అయ్యారు. కృష్ణ గోపాల్ సైతం తీవ్రంగా గాయపడ్డాడు. అయితే.. బాధితులు కట్టుకున్న గుడిసెపై.. సోమవారం రెవెన్యూ అధికారులు దాడి చేశారు. అక్రమంగా గుడిసెను నిర్మించారని వెంటనే ఆ స్థలాన్ని ఖాళీ చేయాలని ఆదేశించారు. కృష్ణ గోపాల్ స్థలాన్ని ఖాళీ చేయనందు వల్లే అధికారులు గుడిసెకు నిప్పంటించారని గ్రామస్థులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఆ ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా అధికారులు భారీగా పోలీసు బలగాలను మోహరించారు.
దేహత్ ఎస్పీ ఐపిఎస్ బిబిజిటిఎస్ మూర్తి మాట్లాడుతూ.. “ప్రభుత్వ భూమిలోని ఆక్రమణను తొలగించడానికి ఎస్‌డిఎఫ్ ఫోర్స్‌తో పాటు మధ్యాహ్నం వచ్చామని చెప్పారు. అదే సమయంలో పొలంలో పని చేస్తున్న మహిళ, ఆమె కుమార్తె గుడిసె వద్దకు రావడంతో వారు తలుపులు వేసి నిప్పంటించుకున్నారు. ఇద్దరూ చనిపోయారు. ఈ విషయంపై విచారణ జరుగుతోంది. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉంది” అని చెప్పారు