భారత్ నేవీలో కొత్త చరిత్ర.. మహిళల యుద్ధభేరీ  - MicTv.in - Telugu News
mictv telugu

భారత్ నేవీలో కొత్త చరిత్ర.. మహిళల యుద్ధభేరీ 

September 21, 2020

2 Women Officers To Be Posted On Indian Navy Warship In Historic First

భారత్ నేవీలో మహిళలు యుద్ధభేరీ మోగిస్తూ కొత్త చరిత్రను ఆవిష్కరిస్తున్నారు. ఏ రంగానికి తాము తీసిపోమంటూ యుద్ధనౌకల్లో తొలి మహిళా అధికారులుగా సబ్‌ లెఫ్టినెంట్లు కుముదిని త్యాగి, రితిసింగ్‌లు అడుగు పెట్టనున్నారు. ఈ ఇద్దరు మహిళా అధికారులు ఇప్పటికే వివిధ అంశాల్లో శిక్షణ పొందారు. నౌకాదళంలోని అత్యాధునిక ఎంహెచ్‌-60ఆర్‌ హెలికాఫ్టర్లలో వీరు విధులు నిర్వహిస్తారని తెలుస్తోంది. సబ్‌మెరైన్లను, శత్రుదేశాల నౌకలను ఎంహెచ్‌-60ఆర్‌ హెలికాఫ్టర్లు గుర్తిస్తాయి. 2018లో రక్షణమంత్రిగా ఉన్న నిర్మలా సీతారామన్‌ లాక్‌హీడ్‌-మార్టిన్‌ నిర్మించిన ఈ హెలికాఫ్టర్ల కొనుగోలు ఒప్పందాన్ని ఖరారు చేశారు.

భారత నౌకాదళంలో పలు ర్యాంకుల్లో ఎంతోమంది మహిళా అధికారులు ఉన్నారు. అయితే యుద్ధనౌకల్లో వీరి నియామకం ఇదే ప్రథమం. నౌకల్లో ఎక్కువ సమయం పనిచేయాల్సి రావడం, సిబ్బంది క్వార్టర్లలో ప్రైవసీ ఇబ్బందులు తెలత్తడం, మహిళలు, పురుషులకు ప్రత్యేక బాత్‌రూంల కొరత వంటి పలు కారణాలతో ఇప్పటివరకూ యుద్ధ నౌకల్లో మహిళా అధికారులను నియమించలేదు. కాగా, రఫేల్‌ యుద్ధ విమానాలకు ఎంపిక చేసిన పైలట్లలో ఓ మహిళా పైలట్‌ను ఐఏఎఫ్‌ నియమించేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేవీలో ఇద్దరు మహిళా అధికారులను నియమిస్తూ సైన్యంలో మహిళలకు సమ ప్రాధాన్యతన కల్పిస్తోంది.