ఈ రూపాయి డాక్టర్.. వేలసంఖ్యలో పునర్జన్మించాలి.. - MicTv.in - Telugu News
mictv telugu

ఈ రూపాయి డాక్టర్.. వేలసంఖ్యలో పునర్జన్మించాలి..

October 4, 2018

మనిషి గొప్పతనం అతడు జీవించి ఉన్నప్పటికంటే అతడు వెళ్లిపోయాకే ఎక్కువగా తెలుస్తుంది. పేరుమోసిన రాజకీయ నాయకుల గొప్పతనాలు సామాన్య జనానికి అంతగా పట్టవు. టీవీలు పగిలేలా వచ్చే సంతాప పాటలు, జెండా అవతనాలు ప్రజలకు అసలు పట్టవు. ఎవరో పోయారంట కదా అనేసి ఎవరి పనుల్లోకి వారు వెళ్లిపోతుంటారు.

ttt

కానీ గురువారం చెన్నైలో అలా జరగలేదు. ఒక డాక్టర్ ఈ లోకం నుంచి నిష్క్రమించారని తెలుసుకున్న ఊరూవాడా అక్కడికి చెమ్మగిల్లిన కళ్లతో కదిలి వచ్చింది. ఆ డాక్టరు తమకు చేసిన సేవలను జనం తలచుకుని భావోద్వేగానికి గురయ్యారు. ఆ డాక్టర్ పేరు జగన్ మోహన్. ఐదు దశాబ్దాలకు పైగా ప్రజలకు నామమాత్రం ఫీజులో చక్కని చికిత్స చేసిన వైద్యో నారాయణోహరి: అన్ని సూక్తికి రుజువుగా నిలిచారు. 78 ఏళ్ల మోహన్ నిన్న రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయనను కడసారి చూడ్డానికి తమిళనాడు నలుమూలల నుంచి జనం తరలి వచ్చారు.

ఫీజు రూపాయి.. టేబుల్‌పై డబ్బా..  

జగన్ మోహన్ రామకృష్ణ మఠం రోడ్డులోని తన క్లినిక్‌ను అసలైన ప్రజావైద్య శాలగా మార్చారు. పేదసాదల పాలిట ప్రత్యక్ష దైవంగా నిలిచారు. మొదట్లో ఫీజు కింద రూపాయి తీసుకునేవారు. తర్వాత 2 రూపాయలు.. ఇటీవల రూ. 20 వరకు తీసుకునేవారు. అసలు డబ్బులేమీ ఇవ్వకపోయినా శ్రద్ధగా వైద్యం చేసేవారు. టైమింగ్స్‌తో సంబంధం లేకుండా ఎవరు ఎప్పుడు డోర్ బెల్ మోగించినా నవ్వుతూ పలకరించి నాడి చూసేవారు. ఆయన టేబుల్ వద్ద ఒక డబ్బా ఉండేది. డబ్బులేని నిరుపేదలు వైద్యం తర్వాత అందులో నాణేలు వేసి వెళ్లేవారు. ఆయన ఆ సంగతి అసలు పట్టించుకునేవారు కాదు. మందుమాకులు కొనలేని వారికి ఆయనే వాటిని ఉచితంగా అందించేవారు. ‘నాకు 16 ఏళ్లప్పుడు పెళ్లయ్యాక ఇక్కడికొచ్చాను. మొదట రూపాయి తీసుకునేవారు మోహన్. తర్వా త 2 రూపాయలు. కొన్నిసార్లు నా వద్ద అసలు డబ్బే ఉండేది కాదు. ఆయన అదేం పట్టించుకోకుండా చికిత్స చేసేవారు.. ’ అని 67 ఏళ్ల సెల్వి అమ్మ గుర్తు చేసుకుంది. అలాంటి మరెందరో అభాగ్యులు ఆయన సేవలను తలచుకుని పొగిలిపొగిలి రోదిస్తున్నారు. ప్రజల మనిషి అంటే ఆయనే అని కొనియాడుతున్నారు.

rr